Share News

చిత్తూరు- తచ్చూరు హైవే ఇక లాంఛనమే

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:20 AM

రూ.4 వేల కోట్లతో 116 కిలోమీటర్లు పూర్తి

చిత్తూరు- తచ్చూరు హైవే ఇక లాంఛనమే
పూర్తయిన చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే

చిత్తూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాకు వరంగా మారిన హైవేల్లో ‘చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే’ ఒకటి. సుమారు మూడేళ్ల కిందట ప్రారంభమైన ఈ హైవే పనులు ఇప్పటికి పూర్తయ్యాయి. నెల రోజుల్లోగా ఈ హైవేను ప్రారంభించి, రాకపోకలకు అనుమతి ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు చెన్నై- బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు పూర్తయితే జిల్లా పారిశ్రామిక ప్రగతి ఊపందుకోనుంది.

చిత్తూరు- తచ్చూరు 6 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్ని 2022 అక్టోబరులో రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. చిత్తూరు సమీపంలోని మాపాక్షి వద్ద ప్రారంభమవుతుంది. ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా పూర్తి చేశారు. మొదటి ప్యాకేజీ ఏపీలో 38.8 కి.మీ, తమిళనాడులో 5 కి.మీ పొడవు ఉండగా, దీని అంచనా విలువ రూ.1,484 కోట్లు. రెండోది ఏపీలో 5.88 కి.మీలు, తమిళనాడులో 11.70 కి.మీలు ప్రయాణిస్తుండగా, దీని అంచనా విలువ రూ.591.99 కోట్లు. మూడోది ఏపీలో 30.32 కి.మీలు, తమిళనాడులో 4.34 కి.మీలు పొడవున ఉండగా, దీని విలువ రూ.1,102.63 కోట్లు. నాలుగోది 20 కి.మీలూ తమిళనాడులోనే ప్రయాణించగా, దీని విలువ రూ.818.73 కోట్లు.

చిత్తూరులో 62.3 కి.మీలు.. తిరుపతిలో 12.7

చిత్తూరు- తచ్చూరు హైవే చిత్తూరు జిల్లాలో 62.3 కిలోమీటర్లు, తిరుపతి జిల్లాలో 12.7 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మిగిలింది తమిళనాడులో ఉంటుంది. ఈ హైవే ప్రయాణించే ప్రాంతాలు పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశముంది. తమిళనాడులోని ఎన్నూరు పోర్టుకు అనుసంధానం చేస్తుండడంతో వాణిజ్యపరంగా ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది.

ఈ నాలుగు ప్రాంతాల్లోనే ఎంట్రీ, ఎగ్జిట్‌

చిత్తూరు 3.4 కి.మీ వద్ద, గంగాధరనెల్లూరు 12.4 కి.మీల వద్ద, శ్రీరంగరాజపురం 32 కి.మీల వద్ద, నగరి 60 కి.మీల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో మాత్రమే వాహనాల్ని హైవే మీదకు అనుమతిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా వాహనాలు వచ్చి వెళ్లే అవకాశం ఉండదు.

‘బెంగళూరు- చెన్నై’కి అడ్డంకిగా మొగిలి ఘాట్‌

చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు పూర్తవ్వగా.. చిత్తూరు జిల్లా మీదుగా వెళుతున్న బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. బెంగళూరు- వి.కోట మధ్య ఇప్పటికే రాకపోకల్ని సాగిస్తున్నారు. వి.కోట నుంచి బంగారుపాళ్యం వరకు 90శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ఫారెస్టు అనుమతుల కారణంగా మొగిలి ఘాట్‌ వద్ద మాత్రమే పనులు పెండింగులో ఉన్నాయి. దీన్ని కూడా ఈ ఏడాది సెప్టెంబరులో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇది మొత్తం పొడవు 267 కి.మీలు ఉండగా.. కర్ణాటకలోని బేతమంగళం వద్ద ప్రారంభమై బైరెడ్డిపల్లె, బంగారుపాళ్యం, గుడిపాల వరకు జిల్లాలో 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. జిల్లాలో ప్రాజెక్టు అంచనా విలువ రూ.4,925కోట్లు. ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు. దీనికి జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె వద్ద, బంగారుపాళ్యం మండలం మొగిలి వద్ద, గుడిపాల మండలం రామాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఉన్నాయి.

Updated Date - Feb 18 , 2026 | 01:20 AM