చిత్తూరు పార్లమెంటులో పెరగనున్న 3 అసెంబ్లీ స్థానాలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:43 AM
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ లెక్కన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరగనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే 7 స్థానాలు పెరిగి 21 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తిగా, రెండు పాక్షికంగా ఉన్నాయి.
8 పూర్తి నియోజకవర్గాలతో జిల్లా?
ఉమ్మడి జిల్లా స్థానాలు 14 నుంచి 21కి పెరిగే అవకాశం
చిత్తూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ లెక్కన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరగనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే 7 స్థానాలు పెరిగి 21 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తిగా, రెండు పాక్షికంగా ఉన్నాయి. పార్లమెంటు పరిధిలో 3 స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో జిల్లా పరిధిలో 8 పూర్తి నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఏ నియోజకవర్గం ఎలా విభజనకు గురవుతుందో, ఏ ప్రాంతంలో కొత్త నియోజకవర్గ కేంద్రం ఏర్పాటవుతుందో ప్రస్తుతం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కేంద్రం అడుగులు వేస్తోంది. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ కోటానూ అమలు చేయనున్నారు.
చిత్తూరు పార్లమెంటులో 10 లేదా 11 నియోజకవర్గాలు..
ప్రస్తుతం చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాలు పూర్తిగా, నగరి, పుంగనూరు నియోజకవర్గాలు పాక్షికంగా జిల్లాలో ఉన్నాయి. ఈ విభజన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు వర్తిస్తుంది. లోక్‌సభ స్థానాల వారీగా విభజన చేస్తే చిత్తూరు పార్లమెంటులోని 7 అసెంబ్లీ స్థానాలు 10 లేదా 11కి చేరనున్నాయి. అలాగే చిత్తూరు, తిరుపతితో పాటు మరో లోక్‌సభ స్థానం ఏర్పాటు కానుంది.
కొత్తగా బంగారుపాళ్యం, పాకాల, పుత్తూరు
రాజకీయ వర్గాల అంచనా మేరకు.. బంగారుపాళ్యం, పాకాల, పుత్తూరు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. బంగారుపాళ్యంలో గుడిపాల, బంగారుపాళ్యం, తవణంపల్లె, యాదమరి మండలాలు ఉండొచ్చు. పాకాలలో పులిచెర్ల, రొంపిచెర్ల, పాకాల, పెనుమూరు ఉండొచ్చని ఓ అంచనా. అలాగే 2009కు ముందు ఉన్న పుత్తూరు నియోజకవర్గం మళ్లీ ఏర్పాటయ్యే అవకాశముంది. ఇక్కడ పుత్తూరు, వడమాలపేట, కార్వేటినగరం మండలాలకు మరొకటి జత చేయొచ్చు. నగరి, నిండ్ర, విజయపురం మండలాలకు మరొకటి జత చేసి నగరి నియోజకవర్గాన్ని అలాగే ఉంచనున్నారు.
అందుకే వాటిని చిత్తూరులో ఉంచేశారా..
ఇటీవల చేపట్టిన జిల్లాల పునర్విభజన సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపకుండా ఉంచేశారు. అలాగే చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలనూ తిరుపతిలో కలపలేదు. అసెంబ్లీ స్థానాల పునర్విభజన సమయంలో ప్రక్రియ సులువుగా సాగేందుకు ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో పాకాల నియోజకవర్గం?
చిత్తూరు పార్లమెంటులోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి సమీపంలో ఉండడంతో దాన్ని తిరుపతి జిల్లాలో కలిపేశారు. కానీ, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పాకాల కొత్త నియోజకవర్గంగా ఏర్పడనుంది. అప్పుడు పాకాలను కచ్చితంగా చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తారని రాజకీయ వర్గాల విశ్లేషణ. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న ఒక్క పాకాల మండలాన్ని తీసుకుని చిత్తూరు జిల్లాలోని మిగిలిన మండలాలతో పాకాల నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తుండడంతో ఈ సమాచారం విశ్వసనీయంగా ఉంది.
ఈ ప్రాంతాల్లోనూ మార్పులు
కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం నాలుగు మండలాలున్నాయి. ఇక్కడ పెద్దగా మార్పుచేర్పులు ఉండకపోవచ్చు. కానీ, పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం గతంలో పుంగనూరు నియోజకవర్గంలో ఉండేది. ఈ మండలాన్ని మార్చే అవకాశాలున్నాయి. అప్పుడు పలమనేరు, వి.కోట, బైరెడ్డిపల్లె, గంగవరం మిగిలి ఉంటాయి. అలాగే 2009కు ముందులాగే పీలేరు, వాయల్పాడు రెండు వేర్వేరు నియోజకవర్గాలు కానున్నాయి.