చిత్తూరు వన్‌టౌన్ సీఐ సస్పెన్షన్
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:20 AM
చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర సస్పెండయ్యారు. గురువారం రాత్రి ఉత్తర్వులు వచ్చాయి. బెట్టింగు నిర్వాహకుల నుంచి ఆయన మామూళ్లు తీసుకోవడమే కారణమని తెలిసింది.
‘బెట్టింగ్’ మామూళ్లు కారణం!
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర సస్పెండయ్యారు. గురువారం రాత్రి ఉత్తర్వులు వచ్చాయి. బెట్టింగు నిర్వాహకుల నుంచి ఆయన మామూళ్లు తీసుకోవడమే కారణమని తెలిసింది. లాటరీ, క్రికెట్ బెట్టింగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షింంచేది లేదని ఓ పక్క ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరిస్తున్నారు. ఈ దిశగా జిల్లాలోని పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పలుచోట్ల నిఘా పెట్టించారు. బెట్టింగు వల్ల ఏ ఒక్కరూ.. వారి వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోరాదని ఆయన పదేపదే చెబుతున్నారు. జనంలోనూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఐపీఎల్ సీజన్‌కు ముందే సీఐ మహేశ్వర చిత్తూరు నగరంలోని బెట్టింగ్ నిర్వాహకులను పిలిపించుకున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన సంఘటనలను వారికి గుర్తు చేసి.. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎంత లాభం వస్తుంది.. ఎవరెవరు బుకీలుగా వ్యవహరిస్తారనే వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. వాళ్లు బెట్టింగ్ నిర్వహించుకొనేందుకు తన వాటాగా రూ.లక్షల్లోనే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ క్రమంలోనే మూడు రోజుల క్రితం క్రికెట్ బెట్టింగు నిర్వహించే వారిపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సుమారు 16 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. సీఐ వ్యవహార శైలిపై విచారించిన అధికారులు.. ఆయన్ను సస్పెండు చేశారు. కాగా, గతంలోనూ ఈయనపై అనేక ఆరోపణలున్నాయి. ఈయన నగరిలో పనిచేసేటప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ సీఐ తమకు వద్దంటూ అప్పటి ఎస్పీకి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫిర్యాదు చేశారు. దీంతో చిత్తూరులో లూప్‌లైన్‌కు సీఐ మహేశ్వరను బదిలీ చేసి.. కొంత కాలానికే వన్‌టౌన్ సీఐగా నియమించారు. ఇప్పుడు సస్పెండయ్యారు.