చిత్తూరు గాంధీ ఇక లేరు
ABN , Publish Date - May 07 , 2026 | 01:32 AM
రైతుల కోసం నేనున్నాను.. అంటూ పోరాడుతూ.. జిల్లా ప్రజలు చిత్తూరు గాంధీగా పిలుచుకునే రైతు ఉద్యమకారుడు ఈదల వెంకటాచలం నాయుడు (73) ఇక లేరు. అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.
రైతుల కోసం జీవితాన్నే త్యాగం
షుగర్ ప్యాక్టరీ కోసం 52 రోజులు నిరాహారదీక్ష
పెనుమూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): రైతుల కోసం నేనున్నాను.. అంటూ పోరాడుతూ.. జిల్లా ప్రజలు చిత్తూరు గాంధీగా పిలుచుకునే రైతు ఉద్యమకారుడు ఈదల వెంకటాచలం నాయుడు (73) ఇక లేరు. అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. పెనుమూరు మండలం పెరుమాళ్లకండ్రిగ గ్రామానికి చెందిన వెంకటాచలం.. 30 ఏళ్లుగా రైతులు, కార్మికుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఇక్కడి రైతుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. పాడి రైతుల కోసం పాల ధరలు పెంచాలని జిల్లాలో పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. పాల ధరలు పెంచేందుకు కృషి చేశారు. గతేడాది డిసెంబరులో ఆరోగ్యం బాగాలేక తిరుపతిలో స్విమ్స్‌కి వెళ్లారు. క్యాన్సర్ అని తేలడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. నాలుగుసార్లు కీమో థెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్యాన్సర్‌తో బాధపడుతూ ఇంటికే పరిమితమైన ఆయన.. బుధవారం అస్వస్థతకు గురయ్యారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. సాయంత్రానికి ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. గురువారం పెరుమాళ్లకండ్రిగలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫ 2004లో ఎన్టీఆర్ జలాశయం నుంచి 32 చెరువులకు నీటి అనుసంధానం, చిత్తూరు నగరానికి తాగునీటి కోసం పోరాటం మొదలు పెట్టారు.
ఫ 2014లో చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ మూత పడటంతో పలు ఉద్యమాలు చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో 52 రోజులు రిలే నిరాహార దీక్ష చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు, రైతులకు రూ.5.44 కోట్లు విడుదల చేసింది.
ఫ 2003లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పెనుమూరు మండలం శాతంబాకం, మఠంపల్లిలో ఆర్టీసీ స్టేజి కోసం పోరాడి సాధించారు.
ఫ నల్లబెల్లం తయారీపై ఆంక్షలు విధించినప్పుడు.. అలాగే, మద్దతు ధర కోసం రైతులతో కలిసి పలు మార్లు ఆందోళన చేశారు. రైతుల కోసం అసెంబ్లీ ముందు ధర్నా చేసిన సందర్భాలెన్నో?
ఫ తన ట్రాక్టర్‌లోనే ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాలకు వెళ్లి అనేక ఉద్యమాలు చేసి రైతులకు అండగా నిలిచారు.
చిత్తూరులో మూతపడిన విజయ డెయిరీని తిరిగి ప్రారంభించే వరకు చొక్కా, చెప్పులు వేసుకోను. అలాగని 2004లో శపథం చేసిన వెంకటాచలం నాయుడు.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచే వరకు అలానే ఉన్నారు. 22 ఏళ్ల పాటు చొక్కా వేయలేదు.