తుది దశకు చిన్నమాంగోడు విధ్వంసం కేసు
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:11 AM
తిరువల్లూరు కోర్టులో నేడు తుది విచారణ
తడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): సరిహద్దుల్లో వేటకు తరచూ ఆటంకం కలిగిస్తుండడంతో పాటు దాడులకు పాల్పడుతుండడంతో సహించలేక మూకుమ్మడిగా ఆ గ్రామంపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన ఘటనకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో తుది విచారణ దశకు వచ్చింది. దీంతో ఆంరఽధా మత్స్యకారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాగైనా తమిళనాడు మత్స్యకారులతో రాజీ కుదుర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే వారు గొంతెమ్మ కోర్కెలు కోరుతుండడంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో పడ్డారు. పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు మత్స్యకారుల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు సమస్య నలుగుతోంది. తరచూ ఇరు రాష్ట్ర మత్స్యకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న ఘటనలున్నాయి. దీంతో విసిగిపోయిన ఆంధ్రా సరిహద్దుల్లోని పులికాట్ తీరప్రాంత 18 మత్స్యకార కుప్పాల మత్స్యకారులు 2013 ఏప్రిల్‌లో మూకుమ్మడిగా వెళ్లి తమిళనాడు చిన్నమాంగోడు గ్రామంలో విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీని సైతం గాయపరిచారు.ఆ ఘటనకు సంబంధించి ఆంధ్రా ప్రాంత 18 మత్స్యకారుల కుప్పాలకు చెందిన 134 మంది మత్స్యకారులపై కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఆ కేసులు తమిళనాడులని తిరువల్లూరు జిల్లా కోర్టులో నడుస్తున్నాయి. 13 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ విచారణ తుదిదశకు చేరుకుంది. బుధవారం తిరువల్లూరు జిల్లా న్యాయస్థానంలో తుది విచారణకు 134 మంది మత్స్యకారులు హాజరుకావాల్సి ఉంది. తీర్పుపై ఆంధ్రా మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.మత్స్యకార నాయకులు తమిళనాడు మత్స్యకారులతో సంప్రదింపులకు సిద్దమయ్యారు. వారం రోజులుగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. తద్వారా 1వ తేదీ నుంచి 18 మత్స్యకారుల గ్రామాల మత్స్యకారులు వేటకు కూడా వెళ్లకుండా దీనిపైనే దృష్టిసారించారు. ఈక్రమంలో తమిళనాడు మత్స్యకారులు రాజీకి రావాలంటే పెద్ద మొత్తంలో నగదును జరిమానా రూపంలో విధిస్తున్నట్లుగా సమాచారం. దాంతోపాటు సరిహద్దులపై నెలకొన్న వివాదాలకు పరిష్కారాలు తాము చెప్పినట్లే జరగాలంటూ షరతు విఽధిస్తున్నారు. ఇప్పటికే 3 కిలోమీటర్ల మేర ఆంధ్రా పులికాట్ జలాల్లోకి వచ్చి తాటి మొద్దులను నాటిన తమిళ మత్స్యకారులు ఈ తుది విచారణ సమయంలో ఆ సరిహద్దును 5 కిలోమీటర్ల వరకు పెంచి అక్కడ తాము తాటి మొద్దులను నాటుతామని దానినే శాశ్వత సరిహద్దుగా గుర్తించాలంటూ షరతు విధించినట్లుగా సమాచారం. దీంతో ఆంధ్రా మత్స్యకారుల్లో అలజడి నెలకొంది.3 కిలోమీటర్లు ముందుకొస్తేనే మత్స్యసంపద దొరకడం గగనమైపోతోందని, అలాంటిది 5 కిలోమీటర్ల వరకు ముందుకొస్తే తామెలా బతకాలంటూ వారు ఆవేదన చెందుతున్నారు.
పట్టించుకోని అధికారులు
అధికారులు సైతం పులికాట్ సరిహద్దు సమస్యను పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది మొదట్లో సరిహద్దు సమస్య ఏర్పడి ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కలెక్టర్ వెంకటేశ్వర్ చొరవ తీసుకొని తిరువల్లూరు కలెక్టర్‌తో చర్చలు జరిపారు. ఆ తరువాత ఆర్డీవోల స్థాయిలో చర్చలు జరిగాయి. అప్పట్లో కొన్ని రోజులపాటు శాంతికమిటీని నియమిస్తామంటూ హడావుడి చేశారు. ఆ తరువాత పట్టించుకోలేదు. తమిళనాడు అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం ఇష్టంలేకపోవడంతో ఆంధ్రా మత్స్యకారులు సైతం అధికారుల చుట్టూ తిరగలేక వారి మత్స్యకార సంఘాలస్థాయిలోనే చర్చలు జరుపుతున్నారు. ఇకనైనా అధికారులు తమిళనాడు అధికారులతో చర్చలు జరిపి పరిష్కారాన్ని చూపకపోతే ఆంధ్రా మత్స్యకారులకు జీవనోపాధి దొరకడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది.