వృథా నీటితో దాహార్తికి చెక్
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:26 AM
ఏటా వర్షాకాలంలో శేషాచల కొండల నుంచి భారీగా నీరు ప్రవహిస్తుంది. తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండం ప్రాంతాల్లో ప్రవహించే ఈ జలాలు ఇప్పటివరకు వృథాగా కాలువల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆ నీటిని నిల్వ చేసి ప్రజల అవసరాలకు మళ్లించే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) శ్రీకారం చుడుతోంది.
రోజూ 80 వేల మంది తాగునీటి అవసరాలు తీర్చేలా తుడా కసరత్తు
ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టి సద్వినియోగం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా తుడా అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే వృథాగా పోతున్న వర్షపు జలాన్ని సంరక్షించి సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. ఈ నీటితో తిరుపతి నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ వినూత్న ప్రాజెక్టు అమలైతే తాగునీటి ఇక్కట్లు తప్పుతాయనే భావన వ్యక్తమవుతోంది.
-తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి
ఏటా వర్షాకాలంలో శేషాచల కొండల నుంచి భారీగా నీరు ప్రవహిస్తుంది. తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండం ప్రాంతాల్లో ప్రవహించే ఈ జలాలు ఇప్పటివరకు వృథాగా కాలువల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆ నీటిని నిల్వ చేసి ప్రజల అవసరాలకు మళ్లించే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) శ్రీకారం చుడుతోంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రాథమికంగా జలాల సేకరణ, ఫిల్టరేషన్, నిల్వ,శుద్ధి వ్యవస్థలపై సాంకేతిక అధ్యయనం చేపట్టినట్లు సమాచారం. ప్రాజెక్టు అమలులోకి వస్తే తిరుపతికి అదనపు తాగునీటి వనరు అందుబాటులోకి రానుంది.
ట్యాంకులకు అనుసంధానం
ఏటా కపిలతీర్థం నుంచి 5,463 లక్షల గ్యాలన్లు, మాల్వాడిగుండం వాగు ద్వారా 5,534 లక్షల గ్యాలన్ల నీరు వృథాగా పోతోందని అధికారుల అంచనా. కపిలతీర్థం పుష్కరిణి నిండాక మిగిలిన 50 శాతం నీరు డీఎ్‌ఫవో కార్యాలయం పక్కన ఉన్న ఎంఐ ట్యాంకుకు, తాగునీటి కోసం ఖాదీ కాలనీలోని ఫిల్టర్ యూనిట్‌కు అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. మాల్వాడి గుండం నీటిని దివ్యారామంలో ఇప్పటికే ఉన్న ట్యాంకులకు మళ్లించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ట్యాంకుల సామర్థ్యాన్ని పెంచనున్నారు. పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని జంతువులకు కూడా తాగునీటిని అందించేలా చర్యలు చేపట్టనున్నారు.
స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం
టీటీడీకి చెందిన భూమిలో ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం వంతున ఆరు జీఎల్‌ఎ్‌సఆర్‌లను (గ్రౌండ్ లెవల్ స్టోరేజ్ రిజర్వాయర్)నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. నిల్వ చేసిన నీటిని ఖాదీకాలనీ సమీపంలోని ఫిల్డ్టర్ యూనిట్‌కు తరలిస్తారు.తద్వారా రెండు వాగుల నుంచి రోజూ 80 వేల మంది యాత్రికుల తాగునీటి అవసరాలు తీరుతాయని అంచనా. కపిలతీర్థం, మాల్వాడిగుండం వాగుల నుంచి వచ్చే నీరు 200 రోజుల అవసరాలకు పనికొస్తుందని భావిస్తున్నారు. స్వర్ణముఖిలో కలిసేముందు 616 ఎకరాల ఆయకట్టుతో పాటు ఆరు చెరువులకు 93.83 ఎంసీఎ్‌ఫటీల మిగులు నీరందుతుంది.