Share News

చూసుకోండి.. సరిచేసుకోండి

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:28 AM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏకీకృత కుటుంబ (యూనిఫైడ్‌) సర్వే ప్రారంభించింది. ఇప్పటికే సచివాలయ సిబ్బంది నమోదు చేసిన కుటుంబ వివరాల ధ్రువీకరణకు జీవోనెం. 118 విడుదల చేసింది. స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సామాజిక తనిఖీ కోసం సర్వే వివరాలు ప్రదర్శిరించారు.

చూసుకోండి.. సరిచేసుకోండి
కార్వేటినగరంలో ఏకీకృత సర్వేపై జరిగిన గ్రామసభలో పాల్గొన్న మహిళలు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏకీకృత కుటుంబ (యూనిఫైడ్‌) సర్వే ప్రారంభించింది. ఇప్పటికే సచివాలయ సిబ్బంది నమోదు చేసిన కుటుంబ వివరాల ధ్రువీకరణకు జీవోనెం. 118 విడుదల చేసింది. స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సామాజిక తనిఖీ కోసం సర్వే వివరాలు ప్రదర్శిరించారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. వీటిపై 24వ తేది వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పోర్టల్‌లో నమోదు చేస్తారు. 27న కుల సంబంధిత ఫిర్యాదులను వీఆర్వోలు పరిశీలించి ఆమోదప్రక్రియ పూర్తిచేస్తారు. ఇతర ఫిర్యాదులను 26వ తేదివరకు పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరిలు పరిశీలించి పరిష్కరిస్తారు. స్థానిక అధికారులు పర్యవేక్షణ చేసి ఫిర్యాదుల పరిష్కారం నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూస్తారు.

వివరాలు అసంపూర్ణం

యూనిఫైడ్‌ సర్వే ఆలస్యంగా మొదలుకావడం, తొలినుంచి యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుమార్లు ప్రభుత్వం గడువును పెంచింది. ఉన్నతాధికారుల ఒత్తిడితో స్వర్ణ గ్రామం, వార్డు ఉద్యోగులు అసంపూర్ణ వివరాలను యాప్‌లో నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రతి కుటుంబం వివరాలను నిశితంగా పరిశీలించిన ప్రభుత్వం అరకొర సమాచారాన్ని వెనక్కి పంపింది. తాజాగా ఫోన్‌, ఆధార్‌ నెంబర్లు సేకరించి విద్యార్హత ధ్రువపత్రాలు, బియ్యం కార్డు, ఇంటి పన్ను రశీదు, విద్యుత్‌ బిల్లులను యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.

బీసీల రిజర్వేషన్లకు ప్రామాణికం

బీసీ జనాభా లెక్క తేల్చేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ (డీసీ) ఏకీకృత సర్వేను ప్రాతిపదికగా తీసుకోనుంది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల ఖరారుకు సర్వే ప్రామాణికం కానుంది. రాష్ట్ర డీసీ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ అన్ని జిల్లాల్లో అధికారులతో సమావేశమవుతున్నారు. శుక్రవారం తిరుపతిలో చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌ సమావేశమై ప్రజలనుంచి వినతులు స్వీకరించారు.

జిల్లా వివరాలివీ

సర్వే చేసిన కుటుంబాలు : 2,74,677

నమోదు చేసినవి : 2,70,968

నమోదు చేయాల్సినవి : 3,709

సర్వే చేసిన కుటుంబ సభ్యులు : 5,28,388

నమోదు చేసినవి : 5,20,135

నమోదు చేయాల్సినవి : 8,253

Updated Date - Jun 20 , 2026 | 02:28 AM