రాజా గణపతికి రథ విహారం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:45 AM
కాణిపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వరసిద్ధుడికి రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకర్లవారిపల్లెకు చెందిన దివంగత యతిరాజులునాయుడు, శివప్రసాద్ జ్ఞాపకార్థం మీనాకుమారి, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం పూర్ణచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ వీఎం, దివంగత చంద్రశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు హరిప్రసాదరెడ్డి ఉభయదారులుగా వ్యవహిరించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాణిపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వరసిద్ధుడికి రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకర్లవారిపల్లెకు చెందిన దివంగత యతిరాజులునాయుడు, శివప్రసాద్ జ్ఞాపకార్థం మీనాకుమారి, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం పూర్ణచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ వీఎం, దివంగత చంద్రశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు హరిప్రసాదరెడ్డి ఉభయదారులుగా వ్యవహిరించారు. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవర్లకు పూజలు చేసి బ్రహ్మరథంపై ఆశీనులను చేశారు. ఉదయం 9-10 గంటల మధ్య భక్తులు, ఉభయదారులు కొంత దూరం రఽథాన్ని లాగి భక్తుల దర్శనార్థం ఉంచారు. బ్రహ్మరథంపై భక్తులు ఉప్పు, బొరుగులు, మిరియాలు, చిల్లర నాణేలు చల్లి, కొబ్బరికాయలు, కర్పూర హారతులిచ్చి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రథాన్ని పురవీధులలో ఊరేగించారు. రథం ముందు మహారాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు, ఆలయ సిబ్బంది ధరించిన సైనికుల వేషధారణలు, కీలు గుర్రాలు ఆకట్టుకున్నాయి. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్, ఎస్‌ఈ సతీష్, ఏఈవోలు, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి,టీడీపీ మండలాధ్యక్షుడు హరిబాబునాయుడు, ఉభయదారులు పాల్గొన్నారు.
శ్రీశైలం అధికారులచే పట్టు వస్త్రాల సమర్పణ
రథోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబికాసమేత మల్లికార్జునస్వామి ఆలయం తరపున చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాక ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ అతిఽథి గృహం వద్ద నుంచి పట్టువస్త్రాలను తీసుకొచ్చి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌కు సమర్పించారు. స్వామిని దర్శించుకున్న శ్రీశైలం ఆలయ చైర్మన్, అధికారులకు శేషవస్త్రాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, శివప్రసాద్, కృష్ణవేణి, శ్రీవాణి, అనసూయ, ఏఈవో రవీంద్రబాబు, శ్రీశైలం ఆలయ ఏఈవో స్వాములు తదితరులు పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు
ఆలయ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భిక్షాండి నిర్వహించనున్నారు. తిరుకల్యాణంకు కాణిపాకం, తిరువణంపల్లెకు చెందిన వణిగ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. రాత్రి అశ్వవాహన సేవకు 44 బొమ్మసముద్రం, తిరువణంపల్లె, చింతమాకులపల్లె, కారకాంపల్లెలకు చెందిన గోనగుంట బలిజ వంశస్థులు ఉభయదారులు.