Share News

చంద్రగిరి మా కుటుంబానికి కలిసొచ్చింది!

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:48 AM

కూటమి పార్టీల శ్రేణులు కలసికట్టుగా ప్రత్యర్థులపై పోరాడాలన్న నారా లోకేశ్‌ మంత్రి అనగాని, ఎమ్మెల్యే నానీలపై ప్రశంసలు

చంద్రగిరి మా కుటుంబానికి కలిసొచ్చింది!
టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైనందుకు లోకేశ్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే నాని, మంత్రి సత్యప్రసాద్‌

తిరుపతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి తమ కుటుంబానికి కలిసొచ్చిన నియోజకవర్గమని, అందుకే దీనిపై తమకు ప్రత్యేకమైన ప్రేమ వుందని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం తిరుపతి శివార్లలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని చంద్రగిరి నుంచే ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. తాను గత ఎన్నికలకు ముందు చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా చంద్రగిరి తనకు టర్నింగ్‌ పాయింట్‌గా మారిందన్నారు. పార్టీ అధినేతను గత ప్రభుత్వంలో అరెస్టు చేశాక నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని కూడా చంద్రగిరి నుంచే ప్రారంభించామన్నారు. ఇక్కడి కార్యకర్తలు తన తల్లిని గుండెల్లో పెట్టుకుని ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు కూడా ఇక్కడే తన రాజకీయ పదోన్నతికి సంబంధించి శుభవార్త విన్నానని, అందుకే చంద్రగిరి తమకు అచ్చొచ్చిన నియోజకవర్గమన్నారు. టీడీపీ అనేది కోటి మంది సభ్యులున్న అతిపెద్ద కుటుంబమని, ఇంత పెద్ద కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు రావడం సహజమన్నారు. తాను ప్రత్యర్థులపై పోరాడిన దానికంటే ఐదు రెట్లు అధికంగా పార్టీలో సంస్కరణల కోసం పోరాడానన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం క్యాడర్‌ కలసికట్టుగా కష్టపడి పనిచేయాలని పిలుపిచ్చారు. కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ శ్రేణులు సంయుక్తంగా ప్రత్యర్థులపై పోరాడాలని సూచించారు. అంతే తప్ప చిన్నచిన్న సమస్యలతో రోడ్డెక్కవద్దన్నారు. శ్రేణులు అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనన్నారు. తాము ఎక్కడికి వెళ్ళినా తొలుత కార్యకర్తలతో సమావేశమయ్యాకే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటానని, అదీ కార్యకర్తలకు పార్టీ ఇచ్చే ప్రాధాన్యతన్నారు. కార్యకర్తలకు తనతో పాటు తన టీమ్‌ కూడా అందుబాటులో వుండి అండగా వుంటుందని భరోసా ఇచ్చారు.

చెవిలో పువ్వును జగనే నమ్మడం లేదు!

చంద్రగిరి చెవిలో పువ్వుగా పేరొందిన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని జగనే నమ్మడం లేదని మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు. చెవిరెడ్డి చేతివాటం జగన్‌కు అర్థమైందని, మద్యం కుంభకోణంలో రూ. 600 కోట్లు కొట్టేశాడని ఆరోపించారు. చివరికి దేవుడి లడ్డూలు, వస్త్రాలను సైతం అమ్ముకున్నాడని ఆరోపించారు. అటువంటి అవినీతిపరుడి నుంచీ చంద్రగిరి ప్రజలకు విముక్తి లభించిందన్నారు.గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ఒక సైకో నుంచీ చంద్రబాబుకు అనగాని, గొట్టిపాటి కాపలా కాశారని గుర్తు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే వ్యక్తి అనగాని అంటూ అభినందించారు. సమస్యలుంటే ఆయన్ను కలవాలని, ఓపిగ్గా చేసిపెడతారంటూ కార్యకర్తలకు సూచించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు నిధుల కోసం నిత్యం తమను వెంటాడుతున్నారని ప్రశంసించారు. గత 22 నెలల్లోనే చంద్రగిరి నియోజకవర్గంలో రూ. 900 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చే బాద్యత తనదని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పాదయాత్రలో తనపై 23 కేసులు పెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలపై 40 వేల కేసులు బనాయించారని గుర్తు చేశారు. ఆ కేసులన్నింటినీ సమీక్షిస్తున్నామని, ఇప్పటి వరకూ 2 వేల కేసులు ఎత్తివేశామన్నారు. 103 కేసులతో పులివర్తి నానీ రాష్ట్రంలోనే మూడో స్థానంలో వున్నారన్నారు. ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి కూడా ఉత్తమ కార్యకర్త అని, ఆమెపై కూడా గత ప్రభుత్వంలో కేసులు పెట్టారని ఆరోపించారు. చివరికి పోలింగ్‌ రోజు కూడా నానీపైన దాడి చేశారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ వాళ్ళు వెధవ పనులు చేయబట్టే వెంకటేశ్వరస్వామి ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మంత్రి లోకేశ్‌ ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, జోనల్‌ ఇంఛార్జి రాంగోపాల్‌రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌ అనిమిని రవి నాయుడు, తుడా ఛైర్మన్‌ దివాకరరెడ్డి, టీడీపీ నేత వీరపల్లి హేమాంబరధర రావు, ఎమ్మెల్యే తనయుడు వినీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 01:48 AM