కృష్ణమ్మకు జలహారతి
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:33 AM
సీఎం చంద్రబాబు రైతు పక్షపాతిగా ఇప్పటికే కుప్పం ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు.
కుప్పం/శాంతిపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రైతు పక్షపాతిగా ఇప్పటికే కుప్పం ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అసంపూర్తిగా ఉన్న హంద్రీ-నీవా కాలువను పూర్తి చేయడమే కాకుండా గతేడాది ఆగస్టులో కృష్ణా జలాలను కుప్పందాకా తీసుకొచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ హంద్రీ నీవా కాలువలో రెండో విడత కృష్ణా జలాలను విడుదల చేశారు. తరలివచ్చిన ఈ జలాలకు మంగళవారం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె సమీపంలోని హంద్రీ-నీవా కాలువలో జలహారతి ఇచ్చారు. చంద్రబాబు రావడానికి ముందు ఉదయం 9 గంటల నుంచే ఈ ప్రాంత పరిసరాలు జనసందోహంతో నిండిపోయాయి. సమీప పల్లెలనుంచే కాదు, నియోజకవర్గం నుంచీ రైతులు, ప్రజలు, మహిళలు తండోపతండాలుగా తరలి వచ్చారు. కాలువ గట్ల వెంబడి, రోడ్డుకు రెండువైపులా బారులుతీరి నిలబడ్డారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ప్రారంభించాల్సి ఉండగా, 1.30 గంటలకు గుండిశెట్టిపల్లెకు చంద్రబాబు చేరుకున్నారు. అప్పటిదాకా జనం ఓపిగ్గా జనం వేచి ఉన్నారు. చంద్రబాబు వస్తుండగానే చిన్నా, పెద్దా, పేద-గొప్ప తారతమ్యం లేకుండా కేరింతలు కొట్టారు. సీఎం నేరుగా వాహనం దిగి హంద్రీ-నీవా కాలువ గట్టు వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసి మెట్లవెంట కిందికి దిగి ప్రవహిస్తున్న కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. అనంతరం కాలువ గట్టునుంచి వెనుదిరిగారు. వీఐపీ గ్యాలరీ వద్దకొచ్చి, అప్పటికే వేచివున్న ప్రముఖులను పలకరిస్తూ.. రోడ్డుమీదికి చేరుకున్నారు. అక్కడినుంచి సుమారు అర కిలోమీటరు కాలినడకన జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత వాహనం ఎక్కి జనాలకు అభివాదం చేస్తూ రోడ్‌షోగా గుండిశెట్టిపల్లె వరకు ప్రయాణించారు. అక్కడ్నుంచి కడపల్లె వద్ద గల ఇంటికి చేరుకున్నారు.
ఓడితే పక్కన పెట్టడం ఖాయం
- ‘స్థానికం’ వంద శాతం గెలిచి తీరాల్సిందే
- టీడీపీ శ్రేణులకు స్పష్టం చేసిన చంద్రబాబు
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీపడే ప్రశ్నే లేదు. వందకి వంద శాతం గెలిచి తీరాల్సిందే. ఏ పంచాయతీ లేదా వార్డు ఓడిపోతారో అక్కడి నాయకులను కచ్చితంగా పక్కన పెట్టేస్తాను’ అని ఖరాఖండీగా చంద్రబాబు చెప్పారు. శాంతిపురం మండలం కడపల్లెలోని తన స్వగృహం సమీపంలో మంగళవారం సాయంత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అఽధినేత హోదాలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పంచాయతీల వారీగా పార్టీ బాధ్యుల పనితీరును చంద్రబాబు సమీక్షించారు. పెర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నవారిని సంజాయిషీ కోరారు. కార్యకర్తల ఆర్థిక బాధ్యతలు తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు. ఇంటికొకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నది తన లక్ష్యమన్నారు. అందుకు అన్నివిధాలా చేయూతనిస్తానన్నారు. దీనిని అందిపుచ్చుకుని ఎదగాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. అదేవిధంగా పార్టీకి అవసరమైన సమయంలో పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతివొక్కరు కష్టపడి పనిచేయాలన్నారు. ప్రజల్లోకి వెళ్లి, పార్టీని పటిష్ఠం చేయాలని, వారిని పార్టీపట్ల ఆకర్షితులను చేసి అభిమానాన్ని కూడగట్టి, ఓట్లుగా మార్చాలని సూచించారు. ప్రతిపక్ష నేతలు రక్తాభిషేకాలు, చంపడాలు, చావడాలు అని వారి కార్యకర్తలను రెచ్చగొడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. మీరూ ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని.. అలాగని దాడులు, దౌర్జన్యాలకు దిగొద్దని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ప్రతిపక్షం చేసే హింసాత్మక చర్యలను చట్టప్రకారం అదుపులో ఉంచడానికి తాను చర్యలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పంచాయతీ, ఒక్క వార్డు కూడా ఓడిపోకూడదని, అలా ఎవరి ఇలాకాలో జరిగినా క్షమించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. అటువంటివారి రాజకీయ భవిష్యత్తు పార్టీపరంగా ఆగిపోతుందని అధినేత హెచ్చరించారు.
తప్పుచేస్తే శిక్ష తప్పదు
‘ఇన్నేళ్లుగా రాజకీయం చేస్తున్నాను. తప్పు మాత్రం జరుగుతోంది. అనుకున్న మెజారిటీతో విజయం ఎందుకు దక్కడం లేదో తెలియదు. స్టేజీమీద ఉన్న నాయకుల్లో లోపమా, లేక మీలో లోపమా తెలుసుకోవాలి. ఇక మీదట అటువంటి లోపాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను. ముందుగా హెచ్చరించి, వినకపోతే చర్యలకు దిగుతాను. కొంతమంది నాయకులు పదవులు వచ్చిన అహంకారంతో విర్రవీగుతున్నారు. అటువంటివారివల్ల గతంలో పార్టీపరంగా నష్టం జరిగింది. ఇకపై అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. మీరైనా, నాయకులైనా, నేనైనా పార్టీ ఉంటేనే అధికారంలో ఉంటాం. అది అందరం గుర్తు పెట్టుకోవాలి. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు. ఈమధ్య మనలో కొంతమంది తప్పు చేస్తే ఇదే పద్ధతి అనుసరించాను. ఎన్ని చెప్పినా అంతిమంగా మీరు అర్థం చేసుకోవాల్సి వస్తోంది. పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా వారి పనితీరుకు నిదర్శనం ఎన్నికల్లో విజయమే. అది లేనినాడు వారికి పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఎటువంటి గుర్తింపు ఉండదు’ అని చంద్రబాబు తెగేసి చెప్పారు.
ముగిసిన చంద్రబాబు పర్యటన
కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండో రోజైన మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు తుమ్మిశి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.