ఇద్దరి ప్రాణాలు బలిగొన్న సెల్‌ఫోన్!
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:35 AM
బావిలో పడిన సెల్‌ఫోన్ వెలికితీయడానికి దిగిన ఇద్దరు ఒడిశా కార్మికులు విష వాయువులు పీల్చడంతో మృతి చెందారు. అలిపిరి సీఐ రామకిషోర్ కథనం ప్రకారం... తిరుపతి వరదరాజనగర్‌లోని ఎస్బీఐ శిక్షణ కేంద్రం ఎదురుగా పాపయ్య ల్యాండ్రీ సంస్థ ఉంది. ఇందులో ఒడిశాకు చెందిన సుమారు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): బావిలో పడిన సెల్‌ఫోన్ వెలికితీయడానికి దిగిన ఇద్దరు ఒడిశా కార్మికులు విష వాయువులు పీల్చడంతో మృతి చెందారు. అలిపిరి సీఐ రామకిషోర్ కథనం ప్రకారం... తిరుపతి వరదరాజనగర్‌లోని ఎస్బీఐ శిక్షణ కేంద్రం ఎదురుగా పాపయ్య ల్యాండ్రీ సంస్థ ఉంది. ఇందులో ఒడిశాకు చెందిన సుమారు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాండ్రీ ఆవరణలో సుమారు 25 అడుగుల లోతైన వరల బావి ఉంది. రెండు గంటలపాటు నీటిని తోడాక అడుగంటి పోతుంటుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో నీళ్లున్నాయో లేవో చూసేందుకు తొంగి చూస్తుండగా భీమరాజ్ (36) అనే కార్మికుడి సెల్‌ఫోన్ బావిలో పడిపోయింది. ఆ ఫోన్ తీసుకోవడానికి భీమరాజ్ బావిలోకి దిగాడు. బావి అడుగున మీథేన్, ఈథేన్ వంటి ప్రమాదకర విషవాయువులు ఉండటంతో వాటిని పీల్చి స్పృహ కోల్పోయాడు. దీన్ని గమనించిన మరో కార్మికుడు నరేష్ (21) అతడిని కాపాడటానికి బావిలోకి దిగాడు. విషవాయువుల కారణంగా అతనూ స్పృహ తప్పాడు. ఇద్దరూ బయటకు రాకపోయేసరికి మరో కార్మికుడు పటేల్ తాడుకట్టుకుని బావిలోకి దిగే ప్రయత్నం చేశారు. సగం లోతుకు వెళ్లేటప్పటికి ఊపిరాడక పోవడం, కళ్లుతిరిగినట్టు ఉండటంతో ఇతర కార్మికులకు చెప్పాడు. వారు వెంటనే పటేల్‌ను బావిలోంచి బయటకు లాగేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రామకిషోర్, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. వెంటనే అగ్నిమాపక అధికారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని బావిలోకి దిగడానికి ప్రయత్నించారు. అయితే బావి ఇరుకుగా ఉండటంతో లోపలికి దిగలేకపోయారు. అనంతరం పాతాళభైరవి పరికరం ఉపయోగించి, మృతదేహాల చేతులకు ఉచ్చు తాళ్లువేసి బావి నుంచి వెలుపలకు తీశారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు.