కుల వివక్ష, భూ సమస్యలు అధికం
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:52 AM
చిత్తూరు జిల్లాలో కుల వివక్ష, భూ సమస్యలు అధికంగా ఉన్నాయని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఆవేదన
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కుల వివక్ష, భూ సమస్యలు అధికంగా ఉన్నాయని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇంకా ఈ జిల్లాలో కుల వివక్ష పూర్తిగా తొలగలేదని, కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా రూపం మార్చుకుని కొనసాగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను రెవెన్యూ, పోలీసు స్టేషన్లకు పదే పదే తిప్పించుకోకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారం ఆలస్యం కావడంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. కుప్పం, పలమనేరు, నగరి ప్రాంతాల్లో అట్రాసిటీ కేసులు అధికంగా ఉన్నాయని, సమగ్ర విచారణ తరువాత ఎస్సీ కమిషన్ కార్యాలయానికి నివేదికలను పంపాలన్నారు. అన్ని రంగాల్లో ఖచ్చితంగా 15 శాతం రిజర్వేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్: కలెక్టర్
జిల్లాలో భూ సమస్యలు, డీకేటీ భూముల సమస్యలు, దళితుల భూముల ఆక్రమణలు, కులధ్రువీకరణ పత్రాల జారీ వంటి అంశాల్లో సమస్యలు ఉన్నాయని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న గ్రీవెన్స్‌లను తీసుకుని ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి పరిష్కారం చూపుతున్నట్లు వివరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించేలా అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు అందిన 89 ఫిర్యాదులను 15రోజుల్లోగా పూర్తి చేసి రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యాలయానికి నివేదిక పంపుతానని తెలిపారు.
పటిష్ఠంగా అట్రాసిటీ చట్టం అమలు: ఎస్పీ
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. జిల్లాలో అట్రాసిటీ కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. డీఎస్పీల ఆధ్వర్యంలో అక్కడి కేసులను విచారణ చేయిస్తున్నామన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ కమిషన్ మెంబర్లు బాబు, బిక్షం, రామాంజినేయమ్మ, చిన్నరాయుడు, ట్రైనీ ఎస్పీ తరుణ్ పహ్వా, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.