అమ్మాయిల మనోభావాలు దెబ్బతీసిన ఫొటోగ్రాఫర్‌పై కేసు
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:36 AM
అమ్మాయిల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి చెప్పారు.
మదనపల్లె క్రైం, జూలై 18(ఆంధ్రజ్యోతి): అమ్మాయిల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎస్‌ఐ కథనం మేరకు..మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ మేకలవారిపల్లెకు చెందిన మనోజ్ ఫొటోగ్రాఫర్. అందమైన ఫొటోలు, వీడియోలు తీసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుండేవాడు. ఇటీవల ఫొటోలు తీసేందుకు మడికయ్యల శివాలయానికి వెళ్లాడు. ‘అమ్మాయిలు చీరకడితే చూడాలనుకునే అబ్బాయిలు ఆ రోజులు మర్చిపోండి..మళ్లీ మళ్లీ రావు, నేను ఈరోజు శివాలయానికి వచ్చాను.. అమ్మాయిలు చీర కట్టుకుని వస్తే ఫొటోలు తీద్దామని రెండుగంటలు వేచి చూసినా ఒక్క అమ్మాయి కూడా చీర కట్టుకుని రాలేదు’ అంటూ మాట్లాడాడు. అనంతరం ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. అమ్మాయిలను కించపరిచేలా, అవమానించేలా, మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడాడంటూ పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ అనే భక్తుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మనోజ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.