Share News

ఏఎస్‌ఐ గాయపడిన ఘటనలో 27 మంది వైసీపీ నేతలపై కేసు

ABN , Publish Date - Aug 12 , 2026 | 02:12 AM

పూతలపట్టులో వైసీపీ ర్యాలీ సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో ఏఎస్‌ఐ జ్యోతి గాయపడిన ఘటనలో 27 మంది పార్టీ నేతలపై సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేశారు.

ఏఎస్‌ఐ గాయపడిన ఘటనలో 27 మంది వైసీపీ నేతలపై కేసు

పూతలపట్టు, (ఆంధ్రజ్యోతి): పూతలపట్టులో వైసీపీ ర్యాలీ సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో ఏఎస్‌ఐ జ్యోతి గాయపడిన ఘటనలో 27 మంది పార్టీ నేతలపై సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేశారు. డీఎస్సీ నియామకంపై అక్రమాలు జరిగాయంటూ పూతలపట్టులో వైసీపీ నేతలు సోమవారం ర్యాలీ చేపట్టారు. దీనికి అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకుంటూ వచ్చారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు పోలీసులు కొంతమందినే అనుమతిచ్చారు. మరికొందరు నాయకులు, కార్యకర్తలు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోసుకుంటూ వచ్చిన కొందరు శ్రేణులు మహిళా ఏఎ్‌సఐ జ్యోతిని తోయడంతో ఆమె కిందపడ్డారు. కొందరు తొక్కుతూ వెళ్లగా.. మిగిలిన కొందరు ఆమెను పైకి లేపి పక్కన కూర్చోబెట్టారు. తలకు గాయమైన ఆమెను పోలీసులు పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏఎ్‌సఐ ఫిర్యాదు మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, లలితకుమారితోపాటు మరో 25 మందిపై సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరులో ఆరుగురిపై..

చిత్తూరు అర్బన్‌, (ఆంధ్రజ్యోతి): పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఆరుగురు వైసీపీ నేతలపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ విజయానందరెడ్డి, నేతలు అల్తాఫ్‌, మనోజ్‌, పురుషోత్తం, సద్దాంపై కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ చిన్నపెద్దయ్య తెలిపారు.

Updated Date - Aug 12 , 2026 | 05:41 AM