ఆటోను ఢీకొన్న కారు ...ముగ్గురి దుర్మణం
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:10 AM
పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణా వడ్డిపల్లె వద్ద గురువారం అర్ధరాత్రి ఆటోను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. పది మంది గాయపడ్డారు. కారు డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘటనకు కారణమని క్షతగాత్రులు తెలిపారు.
పది మందికి గాయాలు
పీలేరు వద్ద ఘటన
పీలేరు, జూన్ 26(ఆంధ్రజ్యోతి): పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణా వడ్డిపల్లె వద్ద గురువారం అర్ధరాత్రి ఆటోను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. పది మంది గాయపడ్డారు. కారు డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘటనకు కారణమని క్షతగాత్రులు తెలిపారు. పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. పీలేరు మండలం రేగళ్లు గ్రామానికి చెందిన కె.మెహరూన్ బీ(70), కోడలు కె.ఇర్ఫానా(45), మనవళ్లు కె.మహమ్మద్ వాహిద్(18), కె.మహమ్మద్ నౌహిద్(16), డి.మహమ్మద్ అఫ్జల్(14), డి.మహమ్మద్ ఆసి్‌ఫ(16)లతో కలిసి అదే గ్రామానికి చెందిన సయ్యద్ ముబారక్(55) ఆటోలో కలికిరి మండలం దూదేకులవారిపల్లెలో మొహర్రం(పీర్ల పండుగ) వేడుకలకు వెళ్లారు. దూదేకులవారిపల్లెలో పీర్ల పండుగ చూసుకుని రాత్రి 12 గంటలకు బయలుదేరారు. దూదేకులవారిపల్లెకు చెందిన సోహైబ్(16), సోహన్(18)లను పీలేరులో దిగబెట్టేందుకు ఆటోలో ఎక్కించుకున్నారు. రాత్రి ఒంటి గంటలకు ఠాణావడ్డిపల్లె వద్ద కడపకు వెళుతున్న కారు వీరి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మెహరూన్ బీ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారు గాయపడ్డారు. అటుగా వెళుతున్న వాహనదారులు 108కు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ సయ్యద్ ముబారక్ మృతి చెందాడు. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా కె.మహమ్మద్ వాహిద్ చనిపోయాడు. మిగిలిన ఆరుగురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఆర్.వెంకటరమణ, ఆయన భార్య ప్రశాంతి, వారి తొమ్మిది నెలల కుమార్తె కుసుమ ప్రియ, బంధువు సుబ్బలక్ష్మిని వేలూరు సీఎంసీకి తరలించారు. పీలేరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మెహరూన్ బీ కుమారుడు బాబా పకృద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిద్రమత్తు కారణంగా కారు డ్రైవర్ పూర్తిగా రోడ్డుకు కుడి వైపునకు రావడంతో ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రులు తెలిపారు. రోడ్డు ప్రమాదం పట్ల ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పీలేరు ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రేగళ్లులో విషాదఛాయలు
ముగ్గురు మృత్యువాతపడటంతో రేగళ్లు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న బాధిత కుటుంబీకులు శుక్రవారం వేకువజామున పీలేరు ఆస్పత్రి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ముబారక్ మృతదేహం వద్ద ఆయన కుమార్తె రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. శుక్రవారం సాయంత్రం గ్రామంలో పీర్ల పండగకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విచారం వ్యక్తం చేశారు.