అదుపు తప్పి లారీని ఢీకొన్న కారు
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:36 PM
మొక్కు తీర్చుకోవడానికి తమ కుటుంబంతో పాటు సోదరి పిల్లలనూ తీసుకుని సతీష్ తిరుమల బయలుదేరారు
పూతలపట్టు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తమ కుటుంబ కష్టాలు తీర్చు స్వామీ అంటూ శ్రీవారిని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి తమ కుటుంబంతో పాటు సోదరి పిల్లలనూ తీసుకుని సతీష్ తిరుమల బయలుదేరారు. ఆ సందర్భంగా మిగతా కుటుంబ సభ్యులకు చెప్పి ‘మేము వెళ్లొస్తాం’ అని చెప్పారు. ఆ దేవుడి దర్శనం చేసుకోకముందే విధి వక్రించింది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందగా, వారిద్దరి పిల్లలు అనాథలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపూర్ జిల్లా చింతామణి గ్రామానికి చెందిన సతీష్ (37) మంద్యాలతార్కారి ప్రాంతంలో ఫ్రూట్‌జ్యూస్ దుకాణం పెట్టుకున్నారు. ఇతడికి భార్య భాగ్యలక్ష్మి (34), కుమార్తె మహాలక్ష్మి (5), కుమారుడు తుషార్ (3) ఉన్నారు. వీరు తిరుమలకు వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని భావించారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన కారును అద్దెకు తీసుకుని శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బయలుదేరారు. తమ కుటుంబంతో పాటు అక్క పిల్లలైన శశాంత్ (14), పావని (16)ని తీసుకుని సతీష్ కారులో బయలుదేరారు. ఆదివారం వేకువజామున 3.10 గంటల సమయంలో వీరి కారు పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపానికి చేరింది. ఆ సమయంలో కారు అదుపుతప్పి ముందు వెళుతున్న లారీలను ఢీకొంది. ఈ ఘటనలో సతీష్, భాగ్యలక్ష్మి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. పూతలపట్టు సీఐ గోపి తమ సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు చిన్నారులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ప్రదీ్‌పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, మృతుడు సతీష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమానని కుటుంబ సభ్యులు చెప్పారు. తన ఛాతీపై పవన్ బొమ్మను వేసుకున్నాడన్నారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు మహాలక్ష్మి, తుషార్ అనాథలయ్యారు. వీరిని చూసి బంధువులు రోదిస్తున్నారు.