27 ఎంపీపీ పదవులకు అభ్యర్థుల ఖరారు
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:21 AM
తిరుపతి జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల (ఎంపీపీ, వైస్ ఎంపీపీ) ఎన్నికలు ఈనెల 19వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండల స్థాయి రాజకీయాల్లో హడావుడి పెరుగుతోంది.
తిరుపతి, ఆంధ్రజ్యోతి: తిరుపతి జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల (ఎంపీపీ, వైస్ ఎంపీపీ) ఎన్నికలు ఈనెల 19వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండల స్థాయి రాజకీయాల్లో హడావుడి పెరుగుతోంది. ఎంపీపీ పదవులకు అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ముగిసింది. జిల్లాలోని మొత్తం 35 మండల పరిషత్‌లకు కూటమి పార్టీలు 31 చోట్ల స్పష్టమైన మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. అందులో టీడీపీ 24 చోట్ల, జనసేన ఒక చోట ఎంపీపీ అభ్యర్థులను ఎంపిక చేసింది. టీడీపీకి సంబంధించి రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి ఎంపీపీ పదవికి తిమ్మయ్యగారిపల్లి ఎంపీటీసీ రాటకొండ కల్పన, ఓబులవారిపల్లి ఎంపీపీ పదవికి ఓబులవారిపల్లి-1 ఎంపీటీసీ ముక్కా వికా్సరెడ్డి పేర్లు ఖరారయ్యాయి. వికా్సరెడ్డి రైల్వే కోడూరు టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి కుమారుడు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి డక్కిలి ఎంపీపీ పదవికి శ్రీపురం ఎంపీటీసీ పోలంరెడ్డి సుమతి, బాలాయపల్లి ఎంపీపీ పదవికి ఆ మండల టీడీపీ అధ్యక్షుడు రావి సత్యం సతీమణి, బాలాయపల్లి ఎంపీటీసీ వాణి పేర్లు ఖరారయ్యాయి. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి సూళ్లూరుపేట ఎంపీపీ పదవి కేసీఎన్‌గుంట ఎంపీటీసీ బూదూరు రమణమ్మకు, నాయుడుపేట ఎంపీపీ పదవి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోదరుడు, పూడేరు ఎంపీటీసీ నెలవల రాజేశ్‌కు, తడ ఎంపీపీ పదవి కొండూరు ఎంపీటీసీ కన్నంబాకం లయకు, దొరవారిసత్రం ఎంపీపీ పదవి కల్లూరు ఎంపీటీసీ గోను జక్కరయ్యకు ఖరారయ్యాయి. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు ఎంపీపీ పదవికి టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తల్లి, పెద్దీటిపాకం ఎంపీటీసీ జమునమ్మ, వరదయ్యపాలెం ఎంపీపీ పదవికి మండల టీడీపీ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, బీఎన్‌కండ్రిగ ఎంపీపీ పదవికి పల్లమాల ఎంపీటీసీ గంగమ్మ, పిచ్చాటూరు ఎంపీపీ పదవికి సింగిల్‌విండో చైర్మన్ జయచంద్రనాయుడు సతీమణి, ఎస్‌ఎ్‌సబీ పేట ఎంపీటీసీ కామేశ్వరి, నాగలాపురం ఎంపీపీ పదవికి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ సతీమణి, నాగలాపురం-1 ఎంపీటీసీ మోహనాంబల్లను ఎంపిక చేశారు. శ్రీకాళహస్తి సెగ్మెంట్లో ఏర్పేడు ఎంపీపీ పదవిపాతవీరాపురం ఎంపీటీసీ కొంగర రవికి, రేణిగుంట ఎంపీపీ పదవి గాజులమండ్యం ఎంపీటీసీ మునిచంద్రారెడ్డికి ఖరారయ్యాయి. నగరి నియోజకవర్గంలో పుత్తూరు ఎంపీపీ పదవి కేబీఆర్‌పురం ఎంపీటీసీ గంజి మాధవయ్యకు, వడమాలపేట ఎంపీపీ పదవి ఎస్వీపురం ఎంపీటీసీ ధనంజయులు నాయుడుకు ఖరారు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి ఎంపీపీగా కల్రోడ్డుపల్లి ఎంపీటీసీ సరిత రమణమూర్తి, ఆర్సీపురం ఎంపీపీగా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ఉమాపతి నాయుడు సతీమణి, నెత్తకుప్పం ఎంపీటీసీ రాధిక, పాకాల ఎంపీపీగా మొగరాల ఎంపీటీసీ ఆముదాల శ్రీహరి నాయుడు, ఎర్రావారిపాలెం ఎంపీపీగా బోడేవాండ్లపల్లి ఎంపీటీసీ మదనమోహన్, చిన్నగొట్టిగల్లు ఎంపీపీగా మండల టీడీపీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళీ సతీమణి, చిట్టిరెడ్డిగారిపల్లి ఎంపీటీసీ గుణసుందరి, తిరుపతి రూరల్ ఎంపీపీగా పెరుమాళ్లపల్లి-2 ఎంపీటీసీ జి.కళ్యాణిలను ఖరారు చేశారు. జనసేనకు కేటాయించిన రైల్వే కోడూరు ఎంపీపీగా ఆ పార్టీ రాష్ట్ర నేత తాతంశెట్టి నాగేంద్ర సతీమణి, ఓబనపల్లి-1 ఎంపీటీసీ తాతంశెట్టి తులసి పేరు ఖరారైంది.
నాలుగు చోట్ల కూటమి అభ్యర్థుల
ఎంపికలో ప్రతిష్ఠంభన
కూటమికి సంబంధించి శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పెళ్లకూరు, నారాయణవనం మండలాల ఎంపీపీ పదవులకు అభ్యర్థుల ఎంపికలో ప్రతిష్ఠంభన నెలకొంది. శ్రీకాళహస్తి ఎంపీపీ పదవిని టీడీపీలో ఇద్దరు ఆశిస్తున్నారు. అక్కుర్తి ఎంపీటీసీ రవీంద్రనాథరెడ్డి, మన్నవరం ఎంపీటీసీ రాంబాబు నాయుడులు పోటీ పడుతున్నారు. వీరిలో రాంబాబు నాయుడు గతంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి పీఏగా పనిచేశారు. వీరిలో ఎవరికి ఎంపీపీ పదవి కేటాయించాలన్న దానిపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే తొట్టంబేడు మండల ఎంపీపీ పదవి కోసం అటు టీడీపీ, ఇటు బీజేపీ పట్టుబడుతున్నాయి. టీడీపీ నుంచి పెద్దకన్నలి ఎంపీటీసీ కొన్నలి రమేష్. బీజేపీ నుంచి చిట్టత్తూరు ఎంపీటీసీ వేడాం కృష్ణయ్య ఇరువురూ ఎంపీపీ పదవిని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడ కూడా ఎవరికి కేటాయించాలన్నదానిపై తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు ఎంపీపీ పదవి కోసం టీడీపీలో ఇద్దరు పోటీ పడుతున్నారు. నెలబల్లి ఎంపీటీసీ ఓజిలి అరుణకుమారి, పెళ్లకూరు ఎంపీటీసీ తడకల అమరావతి రేసులో ఉన్నారు. ఇక్కడ కూడా ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం ఎంపీపీ పదవికి కూడా టీడీపీలోనే ఇద్దరు ఎంపీటీసీల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. వీకేపాలెం ఎంపీటీసీ శాంతకుమారి, సింగిల్‌విండో చైర్మన్ షణ్ముగం సతీమణి, కీలగరం ఎంపీటీసీ విజయ పోటీ పడుతున్నారు. అయితే విజయ భర్త ఇప్పటికే సింగిల్‌విండో చైర్మన్‌గా ఉండటంతో శాంతకుమారికే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఎవరికీ ఖరారు కాలేదు.
ఓజిలి, వాకాడుల్లో టీడీపీకి ఆధిక్యత ఉన్నా
అభ్యర్థులు కరువు
ఓజిలి, వాకాడు మండలాల్లో టీడీపీకి మెజారిటీ ఉన్నా ఎంపీపీ పదవులు సాధించలేని చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓజిలిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ 6, బీజేపీ ఒకటి చొప్పున కూటమి మొత్తం ఏడు స్థానాలు గెలిచింది. వైసీపీ కేవలం మూడు ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ ఎంపీపీ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వు అయింది. అయితే టీడీపీ, బీజేపీల తరపున ఏడుగురు ఎంపీటీసీలుగా గెలిచినా.. వీరిలో ఎవ్వరూ ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు లేరు. అదే సమయంలో వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీటీసీలూ ఎస్సీలే. వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురిలో ఎవరో ఒకరిని తమవైపు లాక్కుని ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలుంటే టీడీపీ 6, వైసీపీ 5 చొప్పున గెలిచాయి. ఇక్కడ ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన ఆరుగురిలో ఎవరూ ఎస్సీ మహిళలు లేరు. వైసీపీ నుంచి గెలిచిన వారిలో ఇద్దరున్నారు. వీరిలో ఒకరిని టీడీపీ వైపు తిప్పుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. అయితే ఆ మండలంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉండడంతో ఆ పార్టీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఈ రెండు మండలాల్లో టీడీపీ నేతలకు సమస్యలు తప్పడం లేదు.
కోడూరు, ఓబులవారిపల్లెల్లో కూటమి క్యాంపులు
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లి మండలాల్లో కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయినా అసమ్మతి బెడదతో ఎంపీటీసీ సభ్యులను క్యాంపులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే కోడూరులో ఎంపీపీ పదవి జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర నేత తాతంశెట్టి నాగేంద్ర సతీమణి తులసికి ఎంపీపీ పదవి ఖరారైంది. ఆ పదవిని ఆశించేవారు కూటమిలో ఇతరులు లేకపోయినప్పటికీ కూటమిలోనే ఓ మాజీ ఎమ్మెల్సీ వర్గం నుంచి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఎంపీటీసీలను విజయవాడలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించినట్టు సమాచారం. అలాగే ఓబులవారిపల్లి ఎంపీపీ పదవి టీడీపీకి కేటాయించగా ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి కుమారుడు వికా్సరెడ్డికి ఖరారైంది. వైసీపీకి కేవలం మూడు ఎంపీటీసీ స్థానాలే దక్కాయి. అయితే కూటమి ఎంపీటీసీల్లోనే కొందరు నిలకడగా లేరని తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన టీడీపీ నేతలు ఎంపీటీసీలతో క్యాంప్ నిర్వహిస్తూ వారు చేజారిపోకుండా జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం.
రెండు చోట్ల వైసీపీ ఎంపీపీలు ఖరారు..
రహస్య ప్రదేశాల్లో ఎంపీటీసీలు
జిల్లాలోని 35 మండల పరిషత్‌లకు గానూ వైసీపీ పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. పెనగలూరు మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలుంటే వైసీపీ 8 గెలుచుకుంది. టీడీపీ, జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులు తలా ఒకటి గెలిచారు. వారిలో ఇండిపెండెంట్ ఎంపీటీసీ కూడా వైసీపీ శిబిరంలోకి చేరిపోయారు. ఇక్కడ పొందలూరు ఎంపీటీసీ చెంగల్‌రెడ్డి ఎంపీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఇక పుల్లంపేట మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ తొమ్మిది గెలుచుకోగా కూటమి ఏడు స్థానాలు గెలిచింది. ఇక్కడ వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా జాగువారిపల్లి ఎంపీటీసీ ముద్దా వైష్ణవి పేరు ఖరారైంది. అధికార కూటమి పార్టీల నేతలు ప్రలోభపెడతారనే భయంతో ఈ రెండు మండలాల్లో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులను రహస్య ప్రదేశాలకు వైసీపీ నేతలు తరలించారు.
వెంకటగిరి, కేవీబీపురాల్లో ఎవరికీ రాని మెజారిటీ
వెంకటగిరి, కేవీబీపురం మండలాల్లో కూటమి, వైసీపీలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ స్థానాలు రాలేదు. దీంతో ఆయా మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వెంకటగిరిలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీకి 4, వైసీపీకి 4 చొప్పున దక్కాయి. టీడీపీ నేతలు తమ ఎంపీటీసీలను పద్మశాలి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించగా.. వైసీపీ ఎంపీటీసీలు నలుగురూ పార్టీ ఇన్చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టు సమాచారం. వైసీపీ నుంచి ఒకరిని తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు గట్టిగా యత్నిస్తున్నారని, అలా వచ్చిన వారికి వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని కూడా ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఇక్కడ ఇప్పటికైతే సస్పెన్స్ కొనసాగుతునే ఉంది. ఎంపీపీ ఎస్టీకి మహిళ రిజర్వు అయింది. ఇరు పార్టీల్లోనూ ఎస్టీలున్నారు. అలాగే సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ ఆరు, వైసీపీ ఆరు చొప్పున గెలుచుకున్నాయి. వైసీపీ నుంచి ఒక ఎంపీటీసీ తమకు అనుకూలంగా ఓటు వేసేలా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ రెండు మండలాల్లో ఎంపీపీ ఎన్నిక జరిగే రోజు గానీ స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.