Share News

కాలువ పొరంబోకు కబ్జా

ABN , Publish Date - May 05 , 2026 | 12:24 AM

కలిసి కబ్జా చేశారు. రూ.రెండు కోట్లకుపైగా విలువైన కాలువ పొరంబోకు భూమిని సొంతం చేసుకున్నారు.

కాలువ పొరంబోకు కబ్జా
చదును చేసిన కాలువ పొరంబోకు భూములు

కలిసి కబ్జా చేశారు. రూ.రెండు కోట్లకుపైగా విలువైన కాలువ పొరంబోకు భూమిని సొంతం చేసుకున్నారు. అధికార యంత్రాంగం సహకారంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగించారు. ఏమైందో ఏమోగానీ.. ఆక్రమణదారుల మధ్యే విభేదాలు తలెత్తాయి. రెండు వర్గాల వారు ఘర్షణకు దిగి.. పోలీసు స్టేషను మెట్లెక్కడంతో కబ్జా వ్యవహారం వెలుగు చూసింది.

- వెదురుకుప్పం, ఆంధ్రజ్యోతి

వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు రెవెన్యూ లెక్కదాఖలు సర్వే నంబరు 346లో ఎనిమిది.. సర్వే నంబరు 347లో ఎనిమిది.. సర్వే నంబరు 348లో ఐదు ఎకరాల కాలువ పొరంబోకుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆళ్లమడుగు, గుండ్లకండ్రిగ గ్రామాలకు చెందిన వీరు ఆక్రమించి.. ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి తెలిసినా లోపాయికార ఒప్పందంతో పట్టించుకోలేదని స్థానికులు విమర్శించారు. ఈ ఆక్రమణ, కబ్జా భూముల విలువ సుమారు రెండు కోట్ల రూపాయలకు పైమాటే. కాలువ పొరంబోకు భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోకపోగా, కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఇదిలా ఉండగా బుచ్చిరెడ్డికండ్రిగ పెద్ద చెరువు నుంచి వెళ్లే వాగు నుంచి సాగునీటిని విద్యుత్‌ మోటార్ల ద్వారా అంటే విద్యుత్‌ చౌర్యంతో పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యుత్‌ మోటార్లు వాగులో చాలా వరకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. చెరకు, మామిడి వంటి పంటలను సాగు చేశారు.

రెండు వర్గాల ఘర్షణ

ఆళ్లమడుగు రెవెన్యూ లెక్కదాఖలా భూ సమస్యల విషయమై ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ విషయమై ఆదివారం సాయంత్రం వెదురుకుప్పం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుండ్లకండ్రిగకు చెందిన కె.రాజబాబు భార్య భువనేశ్వరి తమ పొలానికి వెళ్లే దారిని ఎక్స్‌కవేటర్‌తో తీసేశారని, గొడవకు వచ్చిన తమను కొట్టారని ఆళ్లమడుగుకు చెందిన కలికమ్మ, పురుషోత్తంరెడ్డి, చంద్రకళ, గగన్‌, హేమా, సుగుణ తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ ప్రత్యర్థి వర్గం.. ఆళ్లమడుగు చెందిన గగన్‌, హేమావతి కూడా గుండ్లకండ్రిగకు చెందిన కె.రాజబాబు, చిన్నమ్మి వర్గీయులపై వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా పరస్పరం ఫిర్యాదులతో భూకబ్జా వ్యవహారం వెలుగు చూసింది.

భూ ఆక్రమణలు నిజమే

ఆళ్లమడుగు రెవెన్యూ లెక్కదాఖలు సర్వే నంబర్లు 346,347,348లో కాలువ పొరంబోకు భూములను పలువురు ఆక్రమించుకున్న మాట నిజమే. దీనిపై తహసీల్దార్‌కి చర్యల నిమిత్తం నివేదిక ఇస్తాం. భూ ఆక్రమణలకు మేం సహకరించలేదు. నేను ఇక్కడ విధుల్లో చేరకముందు నుంచే ఆక్రమణలు జరిగి ఉన్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- బాబు, వీఆర్వో, ఆళ్లమడుగు

Updated Date - May 05 , 2026 | 12:24 AM