తేలనున్న భూముల లెక్క
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:27 AM
వ్యవసాయ భూముల కొలతల్లో వాస్తవికతను యజమానులకు తెలియజేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం రీసర్వేకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో తొలి విడతగా గతేడాది జనవరిలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి సర్వే చేపట్టారు.
92 గ్రామాలలో కొనసాగుతున్న ఆరో విడత రీసర్వే
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూముల కొలతల్లో వాస్తవికతను యజమానులకు తెలియజేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం రీసర్వేకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో తొలి విడతగా గతేడాది జనవరిలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి సర్వే చేపట్టారు. అనంతరం ప్రతి మండలం నుంచి విడతలవారీగా రెండు లేదా మూడు గ్రామాలను ఎంపికచేసుకొని రీసర్వే చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదు విడతల్లో కొనసాగింది. ఐదో విడతలో 60 గ్రామాల్లో 1,16,517 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ సర్వే చేపట్టగా, ఇంతవరకు 52 గ్రామాల్లో పూర్తయ్యింది. తాజాగా గత నెల 16 నుంచి ఆరో విడత కింద 92 గ్రామాల్లో 1,60,332 ఎకరాల్లో సర్వే చేపట్టారు. 90 రోజుల్లో పూర్తిచేయనున్న ఈ సర్వే ఇప్పటివరకు 12 గ్రామాలలో పూర్తయింది. ముందుగా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత భూముల సర్వే ప్రారంభిస్తున్నారు.
సంయుక్త ఎల్పీఎంలతో చిక్కులు
గత ప్రభుత్వ హయాంలో రీసర్వే జరిగిన గ్రామాలలో నలుగురు లేదా ఐదుగురు రైతులకు కలిపి సంయుక్త ఎల్పీఎం నెంబర్‌ను ఇవ్వడం, ఆన్‌లైన్‌లో ఉండాల్సిన విస్తీర్ణం లేకపోవడం, సరిహద్దు తేడాలు తదితర సమస్యలు ఎక్కువగా వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసమస్యలను తగ్గించాలన్న ఉద్దేశంతో రీసర్వే జరిగిన గ్రామాల్లో 2024 నవంబరులో గ్రామసభలు నిర్వహించి, బాధిత రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. అయినా సగానికి పైగా అర్జీలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి.
రైతుల సమక్షంలోనే హద్దులు
రీసర్వే ప్రక్రియను పక్కడ్బందీగా నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. 200-250 ఎకరాలకు ఒక బ్లాక్‌గా విభజించారు. ఈ బ్లాక్‌కు ఇద్దరు గ్రామ సర్వేయర్లు, వీఆర్వో, వీఆర్‌ఏతో ఒక బృందం ఉంటుంది. వీరికి సాంకేతిక సిబ్బంది సహాయంగా ఉంటారు. పొలాల గట్లు విస్తీర్ణాన్ని పక్కాగా కొలుస్తారు. ఎక్కడికక్కడ గ్రామ ప్రజలు, భూయజమానుల సమక్షంలోనే దీని సర్వేచేస్తారు. విస్తీర్ణం, రైతు వివరాలు, ప్రస్తుత భూయజమాని, సెటిల్‌మెంట్, టైటిల్ డీడ్ వంటివి నిర్ధారించనున్నారు. ముందుగా సమాచారాన్ని ఆయా భూ యజమానులకు తెలియజేసి, వారి సమక్షంలోనే హద్దులు నిర్ధారిస్తారు. ఎక్కడైనా వ్యత్యసాలుంటే దరఖాస్తు చేస్తే మళ్లీ కొలుస్తున్నామని సర్వే సెటిల్‌మెంట్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పుల్లయ్య తెలిపారు. ‘డాక్యుమెంట్లలో తేడాలు, విస్తీర్ణంలో తక్కువ వచ్చిన ఎల్పీఎం వివరాలపై రీసర్వే ఉప తహసీల్దారుకు అప్పీలు చేయాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అప్పటికీ వీలులేకపోతే ఆర్డీవో స్థాయిలో కొలిక్కి తెస్తారు’ అని ఆయన రైతులకు సూచించారు.