Share News

బీకేపల్లెలో సందడి

ABN , Publish Date - Oct 01 , 2026 | 02:10 AM

మదనపల్లె పట్టణంలో కలసిపోయిన బీకేపల్లె ప్రాంతం బైపాస్‌ రోడ్డు నిత్యం వాహనాల రణగొణ ధ్వనులతో ఉండేది. శు క్రవారం హార్టికల్చర్‌ హబ్‌ శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు రానుండటంతో ఈ ప్రాంతం రెండు రోజులుగా మంత్రులు, అధికారులు, టీడీపీ నాయకుల పరిశీలనతో సందడిగా మారింది.

బీకేపల్లెలో సందడి
ఏర్పాట్లను పరిశీలించి సూచనలిస్తున్న కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌

సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు, అధికారుల హడావుడి

పకడ్బందీగా ఏర్పాట్లు

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మదనపల్లె పట్టణంలో కలసిపోయిన బీకేపల్లె ప్రాంతం బైపాస్‌ రోడ్డు నిత్యం వాహనాల రణగొణ ధ్వనులతో ఉండేది. శు క్రవారం హార్టికల్చర్‌ హబ్‌ శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు రానుండటంతో ఈ ప్రాంతం రెండు రోజులుగా మంత్రులు, అధికారులు, టీడీపీ నాయకుల పరిశీలనతో సందడిగా మారింది. బైపాస్‌ రోడ్డు పక్కనే 32 ఎకరాల ప్రైవేటు స్థలంలో ఓ వైపు 40వేల మంది కూర్చునేలా జర్మన్‌షెడ్లతో నిర్మించిన అతిపెద్ద సభావేదిక, సభావేదికకు ఇరువైపులా 20వేల మంది చొప్పున కూర్చునేలా లెఫ్ట్‌, రైట్‌ హ్యాంగర్స్‌(షెడ్లు) నిర్మాణం పూర్తి అయ్యింది. ఇద్దరు మంత్రులు, డీఐజీ కోయప్రవీణ్‌ పరిశీలనలు, ఉదయం నుంచి కలెక్టర్‌, జేసీ, ఎస్పీ అక్కడే తిష్టవేసి పనుల పర్యవేక్షణ వెరసి బీకేపల్లె ప్రాంతం కొత్త సందడి నెలకొంది.

100 మంది కార్మికులు.. మూడు రోజులుగా నిమగ్నం

సీఎం చంద్రబాబు బహిరంగ సభ అంటేనే అధికారులు పగడ్బందీగా నిర్వహిస్తారు. అలాంటిది కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, రిలయన్స్‌ అధినేత అనంత్‌ అంబాని పాల్గొనే అతిపెద్ద సభ అంటేనే అధికారులు నభూతో నభవిష్యత్‌ అనే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. 100 మంది కార్మికులు మూడు రోజులుగా ఎత్తైన క్రేన్లతో నిర్మించి అతిపెద్ద జర్మన్‌షీట్‌ షెడ్‌ చూసేందుకు ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. పెద్దగాలి, వర్షం వచ్చినా తడవకుండా ఉండేలా బహిరంగ సభావేదిక నిర్మించారు.

అత్యంత భద్రత..కళావేదిక ఆకర్షణ

జడ్‌ప్లస్‌ సెక్యూరిటి ఉున్న సీఎం చంద్రబాబు పాల్గొనే బహిరంగ సభా వేదికకు 30 అడుగుల దూరం వరకు డి-జోన్‌ ఏర్పాటు చేశారు. ఓ వైపు మీడియా గ్యాలరీ, మరో వైపు వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా కుడి, ఎడమ వైపు రెండు కళావేదికలు ఏర్పాటు చేశారు. 150 మంది కళాకారులతో అన్నమయ్య కీర్తలు ఆలపించేలా ఏర్పాట్లు చేశారు. కుడి, ఎడమ వైపు ఉన్న చిన్న షెడ్లలో వీవీఐపీల ప్రసంగం చూస్తూ వినడానికి ఎల్‌ఈడీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సభావేదిక పక్కనే వీవీఐపీలు సేద తీరడానికి గ్రీన్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు.

ఒకే చోట నాలుగు హెలిప్యాడ్‌లు

బహిరంగ సభకు మూడు కిలోమీటర్ల దూరంలోని కొండామరిపల్లె వద్ద ఒకే చోట నాలుగు హెలిక్యాప్టర్లు ల్యాండ్‌ అయ్యేలా హెలీప్యాడ్‌లు నిర్మించారు. ఈ ప్రాంతం చుట్టూ ప్రజలు లోనికి వెళ్లకుండా బారికేడ్లు నిర్మిస్తున్నారు. హెలిప్యాడ్‌ల నుంచి సభా వేదిక వరకు టీడీపీ నాయకులు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. డీఐజీ కోయప్రవీణ్‌, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, జేసీ శివనారాయణశర్మ, ఎస్పీ ధీరజ్‌, సీఎం సెక్యురిటీ అదనపు ఎస్పీ కృష్ణారావు, ఎన్‌ఎస్‌జీ అధికారులు సభావేదిక, హెలీప్యాడ్‌లు, సీఎం పర్యటించే మార్గంలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ హడావుడిగా కనిపించారు. మరో వైపు రాష్ట్ర మంత్రులు జనార్దన్‌రెడ్డి, రాంప్రసాదరెడ్డి, ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, అమరనాథరెడ్డి, పులివర్తి నాని, మురళి, ప్రొగ్రాం కోఆర్డినేటర్‌ పెందుర్తి వెంకటేష్‌ ప్రతి గంటకూ ఒకసారి జిల్లా యంత్రాంగంతో చర్చిస్తూ, ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తం మీద రెండు రోజుల ముందుగానే మదనపల్లెలో బృహత్తర కార్యక్రమం నిర్వహణతో టీడీపీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది.

Updated Date - Oct 01 , 2026 | 02:10 AM