ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు
ABN , Publish Date - Aug 29 , 2026 | 01:11 AM
ఆగిఉన్న లారీని బస్సు ఢీకొనడంతో 18మంది గాయపడ్డ సంఘటన నాయుడుపేట-రేణిగుంట జాతీయ రహదారిలోని పెళ్లకూరు మండలంలో జరిగింది.చెంబడిపాలెం సమీపంలో
- 18 మందికి గాయాలు
పెళ్లకూరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఆగిఉన్న లారీని బస్సు ఢీకొనడంతో 18మంది గాయపడ్డ సంఘటన నాయుడుపేట-రేణిగుంట జాతీయ రహదారిలోని పెళ్లకూరు మండలంలో జరిగింది.చెంబడిపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఆగిఉన్న కట్టెల లారీని బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన పసుపులేటి వెంకటేశ్వర్లు, రియాజ్‌బేగంకు తీవ్రగాయాలు కాగా,16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను ఎస్‌ఐ ఆదిలక్ష్మి 108, 104 వాహనాల ద్వారా నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు ఆరు వరుసల హైవేరోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కు చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా అక్కడక్కడా హోటళ్లు, దాబాలు వెలిశాయి. వాస్తవానికి హోటళ్లు, దాబాల యజమానులు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఎక్కడా ఈ నిబంధనలు అమలు చేయడంలేదు. వాహనాలు కూడా అతివేగంగా వెళ్తుండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.