శ్రీవారి దర్శనం పేరుతో బురిడీ
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:56 AM
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు తిరుమలలో ఏసీ, నాన్ ఏసీ గదులు తీసిస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రచారంతో మోసగించిన ఇద్దరు వ్యక్తులను తిరుమల టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
వందమందిని మోసగించిన ఇద్దరు పెనుమూరువాసుల అరెస్ట్
తిరుమల, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు తిరుమలలో ఏసీ, నాన్ ఏసీ గదులు తీసిస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రచారంతో మోసగించిన ఇద్దరు వ్యక్తులను తిరుమల టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్‌కుమార్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి ‘శ్రావణ్ కళ తిరుమల తిరుపతి దేవస్థానం’ అనే పేరుతో ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల్లో పేజీలు క్రియేట్ చేసి రెండేళ్లుగా భక్తులను మోసగిస్తున్నారు. దర్శనం చేయిస్తామని, గదులు ఇప్పిస్తామని అందినకాడికి దోచుకుంటున్నారు.భక్తుల ఫిర్యాదు మేరకు వీరిపై నిఘా పెట్టిన తిరుమల టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర ,తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలకు చెందిన దాదాపు వందమంది నుంచి నగదు వసూలు చేసినట్టు గుర్తించారు.పవన్‌కుమార్ రెడ్డిపై 2022లోనే తిరుమల టూటౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచే దర్శన టికెట్లు, వసతి పొందాలని పోలీసులు ఈ సందర్భంగా సూచన చేశారు.