తిరుపతి రూరల్ స్టేషన్‌లో ఇంటి దొంగ
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:01 AM
బాధితులకు అప్పగించాల్సిన నగలు కుదువకు గతంలోనూ రూ. 50వేలు నొక్కేసినట్లు ఆరోపణలు
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రజల కష్టార్జితాన్ని దొంగలు చోరీ చేస్తారు. పోలీసులు వారిని పట్టుకుని దొంగిలించిన సొత్తును తిరిగి బాధితులకు అప్పగిస్తారు. కానీ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్ మాత్రం బాఽధితులకు అప్పగించాల్సిన నగలను ఏకంగా తాకట్టుపెట్టినట్టు సమాచారం.సాధారణంగా దొంగల నుంచి రికవరీ చేసిన నగదు , నగలు స్వంతదారులకు పోలీసులు కోర్టుద్వారానే అప్పగిస్తారు.ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు చోరీ సొత్తు సంబంధిత స్టేషన్లలోనే ఉంటుంది. ఇదే క్రమంలో ప్రతీ స్టేషన్‌లో ఎంతో కొంత మొత్తంలో రికవరీ సొత్తుండడం పరిపాటి. ఇలాగే తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న రికవరీ సొత్తు నుంచి సుమారు 12 లక్షల రూపాయల విలువజేసే 90 గ్రాముల బంగారు నగలు మాయమైనట్టు సమాచారం. కోర్టు ప్రక్రియ పూర్తయ్యాక బాధితులకు అప్పగించాల్సిన నగలు కనిపించకపోవడంతో అధికారులు హతాశులయ్యారు.ఇంటి దొంగను గుర్తించి నిలదీస్తే అవసరానికి కుదువ పెట్టుకున్నానంటూ రెండు రోజుల్లో నగలు తెచ్చి ఇచ్చినట్టు సమాచారం. ఇది జరిగి సుమారు నెలరోజులైనప్పటికీ ఇంటిదొంగపై స్టేషన్ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడమే ఆశ్చర్యకరం.పైగా ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి తెలిసినప్పటికీ ఎస్పీ సుబ్బరాయుడి దృష్టికి తీసుకెళ్లలేదు. ఇలాంటి విషయాలపట్ల ఎస్పీ కఠినంగా వ్యవహరిస్తారన్న భయంతో సదరు కానిస్టేబుల్ ఎస్‌బీ సిబ్బంది కాళ్లావేళ్లా పడడంతో దాచేసినట్టు సమాచారం.గతంలోనూ ఇలాంటి ఇంటి దొంగతనాలకు పాల్పడిన చరిత్ర ఆ పోలీసుకున్నట్టు తెలుస్తోంది. 2023వ సంవత్సరంలో ఇదే స్టేషన్‌లో రికవరీ సొమ్ము నుంచి యాభైవేల రూపాయలు కాజేస్తూ సీసీ కెమెరాకు దొరికిపోయినట్టు సమాచారం. అయితే ఆ మొత్తాన్ని ఆయన తిరిగి ఇవ్వకపోవడంతో తన ఆధీనంలోని సేఫ్ లాకర్ (బీరువా)నుంచి ఆ మొత్తం చోరీ అయినందుకు బాధ్యత వహిస్తూ అప్పటి స్టేషన్ రైటర్ ఆ మొత్తాన్ని జమ చేసినట్టు చెప్పుకుంటున్నారు. పదేళ్లక్రితం ఇదే కానిస్టేబుల్ ఏర్పేడులో పనిచేసినపుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని నొక్కేసినట్టు కూడా ఆరోపణలున్నాయి. వాహన చలాన్లను అప్పట్లో మాన్యువల్‌గా రాసేవారు. చలానా పుస్తకాలను జిల్లా పోలీసు కార్యాలయం మాత్రమే జారీ చేసేది.బుక్ పూర్తయిపోతే నమోదుచేసిన చలాన్ల మొత్తాన్ని ట్రెజరీలో చెల్లించి ఆ రిసీప్ట్‌ను, పూర్తయిన చలాన్ బుక్‌ను డీపీవోలో సమర్పించి కొత్త బుక్ తీసుకోవాల్సి ఉండేది. ఈక్రమంలో చలానా మొత్తాన్ని ట్రెజరీలో చెల్లించి, కొత్తబుక్ తీసుకువచ్చే బాధ్యతను అప్పటి ఎస్‌ఐ ఈ కానిస్టేబుల్‌కు అప్పగించారు. ఈయన చలానా పుస్తకాలను జారీచేసే సిబ్బందికి కొంత మొత్తంలో ముడుపులు సమర్పించి కొత్త రసీదు పుస్తకాన్ని తీసుకుని, ట్రెజరీలో చెల్లించాల్సిన మొత్తాన్ని స్వాహా చేసినట్టు సమాచారం. శాఖాపరమైన చర్యలను తప్పించుకునేందుకు అప్పటి ఎస్‌ఐ ఆ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం.