Share News

తిరుపతికి వరాల బడ్జెట్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:18 AM

రాష్ట్రప్రభుత్వం తాజా బడ్జెట్‌లో తిరుపతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. చేనేత కార్మికులకు విద్యుత్‌ రాయితీ అమలు నిర్ణయంతో జిల్లాలోని సుమారు 8 వేల చేనేత, మరమగ్గాల నిర్వాహకులకు మేలు జరగనుంది.

తిరుపతికి వరాల బడ్జెట్‌

-ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా, సిటీ ఎకనమిక్‌ రీజియన్‌గా అభివృద్ధి

-పర్యాటక వసతులతో పాటు హోటల్స్‌, వినోద ప్రదేశాల ఏర్పాటు

- 50 నుంచీ వంద పడకలకు ఈఎస్‌ఐ ఆస్పత్రి

-వెటర్నరీ వర్శిటీలో ర్యాబిస్‌ వ్యాధిని గుర్తించేందుకు అత్యాధునిక పరిశోధనా శాల

-పీపీపీ పద్ధతిలో రైతు బజారులో అత్యాధునిక సదుపాయాల కల్పన

రాష్ట్రప్రభుత్వం తాజా బడ్జెట్‌లో తిరుపతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. చేనేత కార్మికులకు విద్యుత్‌ రాయితీ అమలు నిర్ణయంతో జిల్లాలోని సుమారు 8 వేల చేనేత, మరమగ్గాల నిర్వాహకులకు మేలు జరగనుంది. అదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు పర్వాలేదనిపించినా జిల్లా ప్రయోజనాలకు అవి ఉపయోగపడేలా లేవు. అలాగే విశ్వవిద్యాలయాలకు కూడా చాలీచాలకుండా నిధుల కేటాయింపు జరిగింది. కేవలం నిర్వహణకు తప్ప అభివృద్ధికి, విస్తరణకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

తిరుపతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):కొత్త బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయి పర్యాటక వసతులతో పాటు స్టార్‌ హోటళ్ళు, వినోద ప్రదేశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఓవైపు ఖరీదైన విలాసవంతమైన పర్యాటక సదుపాయాలతో పాటు అంతేస్థాయిలో సామాన్య, మధ్య తరగతి పర్యాటకులను ఆకర్షించేలా హోమ్‌ స్టేలను ప్రోత్సహించనుంది. తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఇపుడున్న 50 పడకల స్థాయి నుంచీ వంద పడకల స్థాయికి పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాయలసీమ స్థాయిలో కార్మికులకు అత్యాధునిక వైద్య చికిత్స అందుబాటులోకి రానుంది.ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో ర్యాబీస్‌ వ్యాధిని గుర్తించేందుకు అత్యాధునిక పరిశోధనాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ పద్ధతిలో తిరుపతి రైతు బజారులో అత్యాధునిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. వీటన్నింటికీ మించి సిటీ ఎకనమిక్‌ రీజియన్‌గా తిరుపతిని అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. శెట్టిపల్లె ల్యాండ్‌ పూలింగ్‌ విధానం అమలుతో ఆ దిశగా ఇప్పటికే ముందడుగు వేసిన సంగతి తెలిసిందే.

8వేలమంది నేత కార్మికులకు మేలు

చేనేత మగ్గాలకు విద్యుత్‌ రాయితీ కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 600 కోట్లు కేటాయించింది.పుత్తూరు, నగరి,నారాయణవనం, సత్యవేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు అధికంగా వున్నారు. చేతి మగ్గాలు 3500 వరకూ వుండగా మరమగ్గాలు 4 వేల దాకా వున్నాయి. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్‌ అందించనుంది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1వ తేదీనుంచీ అమల్లోకి రానుంది. దీంతో జిల్లాలో సుమారు 8 వేల మంది మగ్గాల నిర్వాహకులకు మేలు జరగనుంది.

ప్రాజెక్టులకు కేటాయింపులతో ప్రయోజనం అంతంతమాత్రమే!

తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో నిధులు కేటాయించినా దానివల్ల జిల్లాకు కలిగే ప్రయోజనం అంతంతమాత్రమే. తెలుగుగంగ ప్రాజెక్టుకు గతేడాది రూ. 181.42 కోట్లు విడుదల చేయగా ఈ బడ్జెట్‌లో రూ. 177 కోట్లు అదనంగా మొత్తం రూ. 359.20 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ప్రాజెక్టు నిర్వహణకు తప్ప కొత్తగా కాలువల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్‌ ఏర్పాటుకు సరిపోవు. సోమశిల-స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ పనులకు గతేడాది రూ. 51.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ. 63.50 కోట్లు కేటాయించింది. నిరుటి కంటే స్వల్పంగా నిధులు పెంచినా పెండింగ్‌ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. తిరుపతికి తాగునీరందించే కీలకమైన కండలేరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు కేవలం రూ.కోటి మాత్రమే విదిలించడం గమనార్హం. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు రూ. 2621.74 కోట్లు, గాలేరు-నగరి ప్రాజెక్టుకు రూ.665.37 కోట్లు చొప్పున కేటాయించినా ఆ నిధులేవీ జిల్లాలో ఖర్చు చేసే పరిస్థితి లేదు. హంద్రీ-నీవా ప్రాజెక్టు కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన పనులు రెండవ దశలో జరగాల్సి వుంది. జిల్లాల విభజనతో రెండవ దశ పనులు తిరుపతి జిల్లాకు పరిమితంగా వర్తించనున్నాయి. అవన్నీ కూడా పెండింగులో వున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కేటాయింపుల్లో సింహభాగం అనంతపురం, కడప జిల్లాల్లోనూ, స్వల్ప భాగం అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ ఖర్చయ్యే పరిస్థితి వుంది. అలాగే గాలేరు-నగరి ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు కూడా దాదాపు కడప జిల్లాలో పెండింగ్‌ పనులకే సరిపోయే పరిస్థితి వుంది.

వర్శిటీల అభివృద్ధికి, విస్తరణకు అవకాశమేదీ?

ఎస్వీ యూనివర్శిటీకి గతేడాది రూ. 244.83 కోట్లు కేటాయించగా కొత్త బడ్జెట్‌లో రూ. 226.38 కోట్లు కేటాయించారు. పద్మావతీ మహిళా నిరుడు రూ. 57.33 కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే కేటాయించారు. వెటర్నరీ వర్శిటీకి గతేడాది రూ. 179.30 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 166.14 కోట్లు కేటాయించారు. వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థకు నిరుడు రూ. 1.16 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో 1.26 కోట్లు కేటాయించింది. రేణిగుంటలోని విమానాశ్రయం వద్ద వున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ సంస్థకు సహాయక గ్రాంట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల గ్రాంట్‌ కింద రూ. 24.78 లక్షలు కేటాయించింది. వర్శిటీలకు నిర్వహణకు మాత్రమే నిధులివ్వడంతో వాటిని అభివృద్ది పరచడానికి గానీ, విస్తరించడానికి గానీ వీలు కాకుండాపోతోంది.

ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌కు రూ. 292.76 కోట్లు

శేషాచల అడవుల్లోని అరుదైన, విలువైన ఎర్రచందనం వృక్ష సంపదను కాపాడేందుకు ఏర్పాటు చేసిన రెడ్‌ శాండర్స్‌ యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో రూ. 292.76 కోట్లు కేటాయించింది. టాస్క్‌ఫోర్స్‌ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వీలుగా నిధుల కేటాయింపులు పెంచాల్సి వుంది. తగినన్ని నిధులు కేటాయిస్తే అదనపు సిబ్బంది నియామకం దగ్గర నుంచీ వాహనాలు, పరికరాలు, వసతులు, నిఘా వ్యవస్థ వంటివి మెరుగుపరుచుకునేందుకు వీలవుతుంది. అయితే ప్రభుత్వం 2024-25లో రూ. 291.50 కోట్లు, 2025-26లో రూ. 291.25 కోట్లు చొప్పున కేటాయించగా ఇపుడు కూడా ఇంచుమించు అంతేస్థాయిలో నిధులిచ్చింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ అరకొర సదుపాయాలతో కార్యకలాపాలు కొనసాగించాల్సిందే.

హార్టికల్చర్‌కు ఇతోధిక ప్రాధాన్యం

రాయలసీమ రీజన్‌ను ‘గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌’గా మార్చి రూ.30 వేల కోట్లను కేటాయించారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ సిద్ధం చేసి, 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచనున్నారు. దీంతో చిత్తూరుతోపాటు రాయలసీమలోని అన్ని జిల్లాలూ హార్టికల్చర్‌ హబ్‌గా మారనున్నాయి.

Updated Date - Feb 15 , 2026 | 01:18 AM