Share News

బడ్జెట్‌పై అవగాహన అవసరం

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:28 AM

మన కుటుంబ నిర్వహణకు కేటాయింపుల తరహాలోనే రాష్ట్ర బడ్జెట్‌ కూడా ఉంటుందని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

బడ్జెట్‌పై అవగాహన అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌,

మదనపల్లె, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మన కుటుంబ నిర్వహణకు కేటాయింపుల తరహాలోనే రాష్ట్ర బడ్జెట్‌ కూడా ఉంటుందని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబంలో ఉద్యోగం, వ్యవసాయం తదితర మార్గాల్లో వచ్చే ఆదాయం, ఖర్చులు, ఏయే అవసరాలకు ఎంత కేటాయిస్తామో అదే విధంగానే బడ్జెట్‌ ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం మొదటిసారిగా మదనపల్లెలో సోమవారం బడ్జెట్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమాన్ని చేట్టింది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి మాట్లాడుతూ బడ్జెట్‌ అనేది రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్దేశించే ప్రణాళిక పత్రంగా పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సవ్యంగా సాగడానికి ప్రజల సహకారం ముఖ్యమని వ్యాఖ్యానించారు. జిల్లాకు ప్రభుత్వం 6,010.53కోట్లు కేటాయించిందని చెప్పిన మంత్రి రంగాల వారీగా వివరించారు. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో 80శాతం ఉద్యోగుల జీతభత్యాలకు కేటాయింపులు ఉంటాయన్నారు. వ్యవసాయం, ఇతర ఉత్పత్తుల రంగాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండదని, కేవలం సేవల రంగంపైనే ఆధారపడాల్సి ఉందని కలెక్టర్‌ వివరించారు. ఉద్యోగుల జీత భత్యాలను తగ్గించే అవకాశం లేకపోగా, యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, జాబ్‌ క్యాలెండర్‌తో ఆయా రంగాల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి వస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకు సముచిత స్థానం లభించిందని కొనియాడారు. సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి మాట్లాడుతూ బడ్జెట్‌లో నాలుగు అంశాలను విశదీకరించడం ద్వారా అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్‌ జంగాల శివరామ్‌ బడ్జెట్‌ అంశాలపై మాట్లాడారు.

Updated Date - Mar 31 , 2026 | 01:28 AM