Share News

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

ABN , Publish Date - Aug 23 , 2026 | 03:07 AM

సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీహరికోటకు వెళ్లే రోడ్డులో వున్న కేఆర్‌పాలెం సమీపంలోని చెంగాలమ్మ లే అవుట్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తికి సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసుంటుంది.

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
హత్యకు గురైన వ్యక్తి

సూళ్లూరుపేట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీహరికోటకు వెళ్లే రోడ్డులో వున్న కేఆర్‌పాలెం సమీపంలోని చెంగాలమ్మ లే అవుట్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తికి సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసుంటుంది.మెరూన్‌ కలర్‌ పువ్వుల చొక్కా, సిమెంట్‌ కలర్‌ ప్యాంటు, షూ ధరించి ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహం చుట్టుపక్కల ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యచేసి లే అవుట్‌లో మృతదేహాన్ని తెచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి మెడపై పొడిచిన ఆనవాళ్లుండడమే కాకుండా మృతదేహం పడివున్న నీటిగుంట పక్కనే రాయితో కొట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ రాయికి రక్తపు మరకలు, పక్కనే రక్తపుబొట్లు పడిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. సమీపంలో మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నార్త్‌ ఇండియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.కూలి పనులకు వచ్చిన యువకులు మద్యం తాగేందుకు లే అవుట్‌కు వచ్చి ఆ మత్తులో హత్యకు పాల్పడి ఉండవచ్చుననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీహరికోట రోడ్డుకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో హత్య జరిగి ఉండడంతో సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 03:07 AM