Share News

రొంపిచెర్ల యువతి దారుణ హత్య

ABN , Publish Date - Nov 03 , 2026 | 01:47 AM

తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సి.మల్లవరం వద్ద జాతీయ రహదారి పక్కన హత్యకు గురైన యువతి వివరాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన వేణుగోపాల్‌ కుమార్తె భాగ్యశ్రీ(26)గా తెలిసింది.

 రొంపిచెర్ల యువతి దారుణ హత్య
భాగ్యశ్రీ(ఫైల్‌ఫొటో)

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సి.మల్లవరం వద్ద జాతీయ రహదారి పక్కన హత్యకు గురైన యువతి వివరాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన వేణుగోపాల్‌ కుమార్తె భాగ్యశ్రీ(26)గా తెలిసింది. సీఐ కథనం మేరకు వివరాలు.... గత నెల 30వ తేదీ రాత్రి సి.మల్లవరం వద్ద జాతీయ రహదారి పక్కన యువతి మృతదేహాన్ని గుర్తించారు. బండరాయితో మోదడం వల్ల తల, ముఖం నుజ్జునుజ్జు కావడంతో పాటు మృతదేహం వద్ద ఎలాంటి వివరాలేవీ లభించలేదు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్‌ సీఐ మద్దయ్యాచారి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతురాలి వివారాలు తెలుసుకునేందుకు ఆమె ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలను చూసిన మృతురాలి తంల్లిదండ్రులు వేణుగోపాల్‌, లక్ష్మీదేవి రూరల్‌ పోలీసులను సంప్రదించారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, నగలను చూసి అవి తమ కుమార్తె భాగ్యశ్రీవిగా నిర్ధారించారు. భాగ్యశ్రీ నాలుగు నెలలుగా తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ ఎస్‌బీఐలో క్రెడిట్‌ కార్డుల విభాగంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తోందని, అక్టోబర్‌ 30వ తేదీ రాత్రి నుంచి ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిందని తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. తండ్రి వేణుగోపాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులో వివరాలు మార్చారు. మృతురాలి గుర్తింపును శాస్త్రీయంగా నిర్ధారించేందుకు తల్లి లక్ష్మీదేవికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నట్టు సీఐ వెల్లడించారు. హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Updated Date - Nov 03 , 2026 | 01:47 AM