Share News

మహిళ దారుణ హత్య

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:55 AM

స్నేహితురాలి కుమార్తె పెళ్లికని గురువారం ఉదయం తమిళనాడుకు వెళ్లిన అరుణ (50).. శుక్రవారం ఉదయం ఊత్తుకోట సమీపంలో శవంగా మారారు. దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనతో

మహిళ దారుణ హత్య
అరుణ (ఫైల్‌ ఫొటో)

నిండ్ర, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): స్నేహితురాలి కుమార్తె పెళ్లికని గురువారం ఉదయం తమిళనాడుకు వెళ్లిన అరుణ (50).. శుక్రవారం ఉదయం ఊత్తుకోట సమీపంలో శవంగా మారారు. దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనతో నిండ్ర మండలం చవరంబాకంలో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లా పొదట్టూర్‌పేట సమీపంలో జరిగే తన స్నేహితురాలి కుమార్తె శుభకార్యానికని గురువారం ఉదయం చవరంబాకం గ్రామానికి చెందిన మంజునాథ్‌ భార్య అరుణ బయలుదేరి వెళ్లారు. ఆమె 20 సవర్ల బంగారు నగలు ధరించి ఉన్నారు. ఊత్తుకోట సమీపంలోని డొట్టారెడ్డికుప్పం- వెల్లైకుళం ప్రాంతంలో (తండలం వద్ద) ముళ్లపొదల్లో శుక్రవారం ఉదయం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతురాలి ముఖంపై యాసిడ్‌ పోసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. కాగా, మృతదేహం సమీపంలో ఆధార్‌ కార్డు లభించింది. దాని దాని ఆధారంగా అక్కడి పోలీసులు.. నగరి పోలీ్‌సస్టేషన్‌కు సమాచారం అందించారు. నగరి పోలీసులు చవరంబాకం గ్రామస్తులకు, బంధువులకు సమాచారం తెలియజేశారు. దీంతో ఇక్కడ్నుంచి వీరు సంఘటన స్థలానికి వెళ్లారు. ఊత్తుకోట పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆమె వద్దనున్న 20 సవర్ల బంగారు నగలు అపహరణకు గురైనట్లు తెలిసింది. హత్యకు కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. కాగా, మృతురాలు అరుణ భర్త మంజునాథ్‌ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు పెళ్లీడుకొచ్చిన కుమారుడు, కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమె మృతితో చవరంబాకంలో విషాదం నెలకొంది.

Updated Date - Aug 29 , 2026 | 12:55 AM