దోపిడికి వచ్చి దారుణ హత్య
ABN , Publish Date - Aug 09 , 2026 | 01:17 AM
దోపిడీకి వచ్చి కాపలాదారును హతమార్చిన సంఘటన కలకలం రేపింది. చిత్తూరు మండలం మంగాపురంలో జరిగిన ఈ వైనంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమోరికాలో స్థిరపడ్డారు. ఇక్కడ పెద్ద నివాసభవనం ఉంది. పొలాలు కూడా ఉన్నాయి.
కాపాలదారుడి గొంతుకోసిన దుండగులు
నాటు బాంబుతో డోర్ పగులగొట్టిన వైనం
వెంటనే పారిపోయిన దుండగులు
అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు
చిత్తూరు రూరల్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): దోపిడీకి వచ్చి కాపలాదారును హతమార్చిన సంఘటన కలకలం రేపింది. చిత్తూరు మండలం మంగాపురంలో జరిగిన ఈ వైనంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమోరికాలో స్థిరపడ్డారు. ఇక్కడ పెద్ద నివాసభవనం ఉంది. పొలాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు స్వగ్రామానికి వస్తుంటారు. ఆయన చెల్లెలు విజయ, ఆమె భర్త వెంకటేశులు ఈ బంగ్లాలో ఉంటూ ఇల్లు, పొలాల బాధ్యతలను చూసుకుంటారు. బాపట్ల జిల్లా ఆళ్లపాడు గ్రామానికి చెందిన ఆనందరావు(50) వీరి ఇంట్లో పనులు చేసేవాడు. ఈక్రమంలో శుక్రవారం అర్థరాత్రి కొందరు దుండగులు బంగ్లా వద్దకు చేరుకున్నారు. ఇంటి బయట నిద్రిస్తున్న ఆనందరావును గొంతు కోసి కిరాతకంగా చంపేశారు. తర్వాత ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వెంట తెచ్చుకున్న నాటు బాంబుతో గ్లాస్ డోర్‌ను ధ్వంసం చేశారు. ఈక్రమంలో పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న విజయ, వెంకటేశులు లేచి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగులు ఇంటి పక్కన ఉన్న మామిడి తోటలోకి దూకి పరారయ్యారు. హతుడు ఆనందరావు పదకొండేళ్లుగా ఈ ఇంట్లో పనులు చేస్తూ రాత్రి వేళ ఇంటి బయట కాపలాగా ఉండేవాడు. ఇతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వగ్రామంలోని ఉంటున్న వీరికి ప్రతినెలా తన వేతనాన్ని పంపేవాడు.
వారం రోజులుగా రెక్కీ..?
ఘటనకు వారం రోజుల ముందు కొందరు అనుమానాస్పద వ్యక్తులు ఇంటి పరిసరాల్లో సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. సమీప గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారిగా భావించి పట్టించుకోలేదు. గత శనివారం కూడా ఈ ఇంటి మీదుగా పల్సర్ బైక్‌పై ఓ అపరచితుడు రాగా గ్రామస్తులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అతడు వేగంగా వెళ్లిపోయాడని గ్రామస్తులు పేర్కొన్నారు. అప్పుడే పోలీసులకు సమాచారమిచ్చినట్లు వారు తెలిపారు. ఇంటి పరిసరాల్లో రెండు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. నల్లమందు గ్రానైట్ క్వారీల్లో బండలను పగలగొట్టేందుకు వీటిని వాడతారు. దుండగులు క్వారీల్లో పనిచేసే ఉత్తర భారత దేశానికి చెందిన వారేమోనని అనుమానిస్త్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలను సేకరించారు.నిందితుల కోసం జాగిలాలతో జల్లెడ పడుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ భవనంలో ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయకపోవడం పోలీసులను విస్మయ పరిచింది. దుండగులు ప్రవేశించిన సమయంలో కాంపౌండ్‌లో ఇంటి యజమాని పెంచుతున్న రెండు కుక్కలు కూడా ఏమాత్రం స్పందించలేదు. దుండగులు వాటికి మత్తు మందు ఇచ్చారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కుక్కలు డల్‌గా కనిపించడాన్ని పోలీసులు గుర్తించారు. అలాగే ఆనందరావుకు ఎవరితోనైనా ఏమైనా వ్యకిగత విభేదాలు లేదా ఇతర పరిచయాలు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.