Share News

ఆస్తి పంపకంలో తండ్రికి అన్యాయం జరిగిందని కిరాతకం

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:43 AM

మనుమడే కాలయముడయ్యాడు. తాత,నాన్నమ్మలను కడతేర్చాడు. రామకుప్పం పట్టణ శివార్లలో శుక్రవారం రాత్రి వెంకటేశు(65), పార్వతమ్మ(60) దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరిని మనుమడే కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చాడు.

 ఆస్తి పంపకంలో తండ్రికి అన్యాయం జరిగిందని కిరాతకం

పోలీసుల అదుపులో నిందితుడు, అతడి తల్లిండ్రలు

రామకుప్పం, జూలై 18(ఆంధ్రజ్యోతి): మనుమడే కాలయముడయ్యాడు. తాత,నాన్నమ్మలను కడతేర్చాడు. రామకుప్పం పట్టణ శివార్లలో శుక్రవారం రాత్రి వెంకటేశు(65), పార్వతమ్మ(60) దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరిని మనుమడే కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బందార్లపల్లెకు చెందిన వెంకటేశు, పార్వతమ్మ దంపతులకు అమరనాథ్‌, రామకృష్ణలు కుమారులు. వెంకటేశు బోరు మెటారు మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇద్దరు కుమారులకు పెళ్ళిళ్ళు చేశాడు. అమరనాథ్‌ దంపతులకు పాప,బాబు ఉన్నారు. అలాగే రామకృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. అమరనాథ్‌ కొడుకు(17) ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ప్రాణాలు తీసిన ఆస్తి పంపకం

వెంకటేశ్‌కు కొన్నాళ్లుగా సవతి తల్లి కుమారులతో ఆస్తి వివాదం నడిచింది. 15 రోజుల క్రితం ఇది పరిష్కారమైంది. దీంతో తమకు ఆస్తుల పంపకాలు చేయాలని వెంకటేశుపై ఇద్దరు పిల్లలు ఒత్తిడి తెచ్చారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం ఆస్తి పంపకాలు చేపట్టినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అమరనాథ్‌ తరచూ తండ్రిలో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి వెంకటేశు, పార్వతమ్మలు దారుణంగా హత్యకు గురయ్యారు. ఎస్పీ రాజశేఖర్‌రాజు, చిత్తూరు, పలమనేరు డీఎస్పీలు వెంకటనారాయణ, ప్రభాకర్‌లు సిబ్బందితో రామకుప్పంకు చేరుకుని కేసును చేధించేపనిలో నిమగ్నమయ్యారు. అమరనాథ్‌ను వారు అనుమానించారు. దీంతో పోలీసులు అమరనాథ్‌ దంపతులు, అతని పిల్లలను అదపులోకి తీసుకున్నారు. తమదైన రీతిలో విచారణ సాగించారు. దీంతో హత్య మిస్టరీ వీడినట్లు సమాచారం. ఆస్తి పంపకాల విషయంలో తండ్రి పడుతున్నమనోవేదన చూడలేక తానే తాత,నాన్నమ్మలను హత్య చేసినట్లు అమరనాథ్‌ కుమారుడు అంగీకరించినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి బైక్‌పై వస్తున్న తాతపై కత్తితో దాడి చేశానని చెప్పుకొచ్చాడు. దాడి విషయం బయటపెడుతుందనే ఉద్దేశంతో నానమ్మను కూడా నరికి చంపానని చెప్పినట్లు భోగట్టా. హత్య వెనుక ఎవరి ప్రోద్బలం లేదని చెప్పాడు. హత్య చేశాక నిందితుడు మిట్టపల్లె సమీపంలోని క్వారీ గుంతలో కత్తిని పడేశాడు. రక్తపుమరకలున్న దుస్తులను అక్కడే కాల్చేశాడు. తర్వాత ఇంటికి చేరుకున్నాడు. హత్యల ఎవరి ప్రమేయం లేదన్న నిందితుడి మాటలను పోలీసులు విశ్వసించడం లేదని తెలిసింది. కాగా శనివారం రామకుప్పం-బందార్లపల్లె మధ్య వ్యవసాయక్షేత్రంలో వెంకటేశు, పార్వతమ్మల అంత్యక్రియలు జరిగాయి. ఈక్రమంలో అమరనాథ్‌ దంపతులను పోలీసులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 01:43 AM