Share News

అన్నా.. మేమెలా బతికేది?

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:36 AM

అమ్మను చంపి నాన్న జైలు కెళ్లాడు. ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బంధువుల సహకారంతో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు లేకున్నా.. అన్న ఉన్నాడన్న భరోసా ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ఉండేది. ఆ అన్న కూడా సోమవారం మృతిచెందాడు. ఆ అండా పోవడంతో.. మేమెలా బతికేది అంటూ అక్కా చెల్లెళ్లు రోదిస్తున్నారు.

అన్నా.. మేమెలా బతికేది?
రమ్య, కావ్య - మృతి చెందిన ప్రకాష్‌ (ఫైల్‌ ఫొటో)

తల్లిని చంపి జైలుకెళ్లిన తండ్రి

అండగా ఉన్న అన్న అనారోగ్యంతో మృతి

అనాథలైన అక్కా చెల్లెలు

శాంతిపురం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అమ్మను చంపి నాన్న జైలు కెళ్లాడు. ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బంధువుల సహకారంతో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు లేకున్నా.. అన్న ఉన్నాడన్న భరోసా ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ఉండేది. ఆ అన్న కూడా సోమవారం మృతిచెందాడు. ఆ అండా పోవడంతో.. మేమెలా బతికేది అంటూ అక్కా చెల్లెళ్లు రోదిస్తున్నారు. ఈ విషాద ఘటన శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ మాదనపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునస్వామి, మంగమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు ప్రకాష్‌(18), కుమార్తెలు రమ్య(17), కావ్య(15) ఉన్నారు. ప్రకాష్‌ ఇడుపులపాయ ట్రీపుల్‌ ఐటీలో చదువుతున్నాడు. రమ్య, కావ్య కేజీబీవీ పాఠశాలలో చదువుకుంటున్నారు. మునస్వామి మద్యానికి బానిసై రోజూ భార్యను హింసించేవాడు. ఒకటిన్నర సంవత్సరం కిందట తాగుడుకు డబ్బులివ్వడం లేదని భార్యను హత్య చేశాడు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుపాలు కావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కొంతకాలం బంధువులు చేరదీశారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సీఎం సహాయ నిధినుంచి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత కొంతకాలానికి తండ్రి మునస్వామి జైలు నుంచి విడుదలైనా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లాడో తెలియదని బంధువులు చెబుతున్నారు. బంధువుల సహకారంతో ప్రకాష్‌ ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో, రమ్య, కావ్య కేజీబీవీ పాఠశాలలో చదువుకుంటున్నారు. పరిస్థితుల కారణంగా ఇడుపులపాయలో చదువుకుంటున్న ప్రకాష్‌ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన ప్రకా్‌షను బంధువులు పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వారికి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మూడు నెలల కిందట అక్కా చెల్లెళ్లను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. దీంతో ప్రకా్‌షకు మెరుగైన చికిత్స చేయించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికారులు స్పందించి ప్రకా్‌షకు మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అన్న మృతితో రమ్య, కావ్య రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు, బంధువులు ఎంత ఓదార్చినా వారి కన్నీరు ఆపడం సాధ్యపడలేదు.

Updated Date - Sep 02 , 2026 | 01:36 AM