సచివాలయ పోలీసులను పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురండి
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:42 AM
మహిళా పోలీసులను తిరిగి పూర్తిస్థాయిలో పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురావాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను తిరిగి పూర్తిస్థాయిలో పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురావాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులతో సీఎం బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థలో మరింత సమర్థవంతమైన మార్పులు చేపట్టేందుకు అధికారులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మహిళా పోలీసుల విద్యార్హతలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్లు, జిల్లా పోలీసు కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ పనులకు వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా కంప్యూటరైజేషన్, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ, సీసీ కెమెరాల మానిటరింగ్, సైబర్ కైరమ్ డెస్క్ వంటి విభాగాల్లో వారి సేవలను ఉపయోగించుకుంటే పోలీసులపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.ఎస్పీ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఈ అంశమై సూచనలు చేశారు. ఆ తరువాత ఎస్పీ మాట్లాడుతూ... చిన్న విషయాలకే గంజాయి బ్యాచ్ హల్చల్ అంటూ తప్పుడు ప్రచారం చేసి పోలీసు వ్యవస్థపై మచ్చ తెచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని, ఇటువంటి పరిస్థితులను అరికట్టేందుకు తాము తక్షణమే డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా తనిఖీ చేసి, అది గంజాయి బ్యాచ్ కాదు అని నిర్ధారించి గట్టి కౌంటర్ ఇస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్రగ్ కిట్ల సంఖ్యను పెంచి, అనుమానితులకు ప్రతి నెలా ర్యాండమ్ చెకప్ నిర్వహించాలని సూచించారు. గంజాయి వాడకందారుల్లో మార్పు శాతాన్ని నమోదు చేయాలని సూచించారు. పోలీసింగ్, ప్రజా రక్షణలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపయోగించుకోవాలని సూచించారు.