ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:35 AM
కాణిపాక ఆలయంలో బుధవారం సాయంత్రం జరిగిన ధ్వజావరోహణంతో వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈనెల 15వ తేదీన మూషిక ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేయడంతో మొదలైన బ్రహ్మోత్సవాలు.. తొమ్మిది రోజులపాటు కన్నులపండువగా జరిగాయి.
నేటి నుంచి కాణిపాకంలో ప్రత్యేక ఉత్సవాలు
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాణిపాక ఆలయంలో బుధవారం సాయంత్రం జరిగిన ధ్వజావరోహణంతో వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈనెల 15వ తేదీన మూషిక ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేయడంతో మొదలైన బ్రహ్మోత్సవాలు.. తొమ్మిది రోజులపాటు కన్నులపండువగా జరిగాయి. చివరి రోజైన బుధవారం సాయంత్రం ధ్వజస్తంభంపై ఉన్న మూషిక ధ్వజ పటాన్ని వేదమంత్రాల నడుమ కిందకు దించారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
వేడుకగా త్రిశూల స్నానం
ఆలయ పుష్కరిణి వద్ద త్రిశూల స్నానాన్ని అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్, వేదపండితులు వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామికి రక్షగా యాగశాలలో ఈ త్రిశూలాన్ని ఉంచుతారు. ప్రతి రోజు ఉదయం టింగ్‌టింగ్ పిళ్లారప్పగా త్రిశూలాన్ని(సప్పరం)పై ఊరేగించారు. చివరి రోజున యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించి 108 మట్టి కుండలలో ఉంచిన నవ ధాన్యాలను పుష్కరణి వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం త్రిశూలాన్ని నీళ్లలో మునక వేయించి.. నవధాన్యాలను పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్, ఏఈవోలు రవీంద్రబాబు, ధనపాల్, ఎస్వీకృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా వసంతోత్సవం
బ్రహ్మోత్సవాల్లో అలసిపోయిన ఆలయ అధికారులు, సిబ్బంది బుధవారం ఆట విడుపుగా వసంతోత్సవాన్ని నిర్వహించారు. చైర్మన్, ఈవో, అధికారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. వీరితో పాటు భక్తులూ పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు
కాణిపాకంలో గురువారం నుంచి 11 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజు జరిగే అధికార నంది వాహనసేవకు కాణిపాకానికి చెందిన వళ్లువర్ వంశస్థులు ఉభయదారులు. 25న రావణబ్రహ్మ, 26న విమానోత్సవం, 27న సూర్యప్రభ, 28న చంద్రప్రభ, 29న యాళి, 30న కల్పవృక్ష, అక్టోబరు 1న పూలంగి సేవ, ప్రాకారోత్సవం, 2న కామధేను, 3న పుష్ప పల్లకి, 4న తెప్పోత్సవం జరగనున్నాయి.