ఉద్యోగులకు వరాలు.. పరిశ్రమలకు స్థలాలు..
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:24 AM
జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారు. అలాగే 2004లో నోటిఫికేషన్ జారీ అయ్యాక ఉద్యోగాల్లో చేరిన వారికి ఓపీఎస్ విధానం అమలు చేయనున్నారు. ఇక జిల్లాలో ఏర్పాటు కానున్న పలు పరిశ్రమలకు భూమి కేటాయించారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయాల్ని ఆమోదించారు.
క్యాబినేట్ నిర్ణయాలతో జిల్లాకు మేలు
చిత్తూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారు. అలాగే 2004లో నోటిఫికేషన్ జారీ అయ్యాక ఉద్యోగాల్లో చేరిన వారికి ఓపీఎస్ విధానం అమలు చేయనున్నారు. ఇక జిల్లాలో ఏర్పాటు కానున్న పలు పరిశ్రమలకు భూమి కేటాయించారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయాల్ని ఆమోదించారు.
106 ఎకరాల్లో భారీ ఫర్నీచర్ తయారీ కేంద్రం
గుడుపల్లె, శాంతిపురం మండలాల పరిధిలో 106 ఎకరాల్లో ‘మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డు’, ‘ఫర్నీచర్ ఉత్పత్తుల సమగ్ర తయారీ కేంద్రం’ ఏర్పాటు కానుంది. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ‘అవేరాన్ ప్యానెల్స్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థకు 106 ఎకరాల భూమిని ‘ల్యాండ్ ఫర్ అదర్స్’ విధానం కింద కేటాయించేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో కుప్పం నియోజకవర్గంలోని యువతకు పెద్దయెత్తున ఉపాధి లభించనుంది.
జీడీనెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
జీడీనెల్లూరు పారిశ్రామిక ప్రాంతంలోని 1.57 ఎకరాల భూమిని నూతన ప్రాజెక్టు కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమి ‘పుట్టా శ్రీ లెదర్స్ ప్రైవేటు లిమిడెట్’ అధీనంలో ఉంది. ఇక్కడ సరికొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ‘సీపీ నార్ఫోక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్’ సంస్థకు ఈ భూమిని పూర్తిగా విక్రయించడానికి ‘పుట్టా శ్రీ లెదర్స్’ సంస్థకు ప్రభుత్వం నో అబ్జక్షన్ సర్టిఫికెన్ జారీ చేసేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ రూ.12.96 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో 49 మందికి ఉపాధి లభించనుంది.
రూ.216 కోట్లతో చికెన్ ప్రాసెసింగ్ కేంద్రం
జిల్లాలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ‘ఇంటిగ్రేటెడ్ చికెన్ ప్రాసెసింగ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీన్ని రూ.216 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తుండగా, 480 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఈ కేంద్రాన్ని స్థాపించనున్న ‘మెసర్స్ న్యూట్రీఫీడ్ అండ్ ఫార్మ్స్ ప్రైవేటు లిమిటెడ్’కు ప్రత్యేక ప్యాకేజీ కింద సబ్సిడీ మంజూరు చేయడానికి క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
529.34 ఎకరాల్లో డీకేటీ పట్టాలు
కలెక్టర్ ప్రతిపాదనల మేరకు కుప్పం మండలం కంగుంది రిజర్వు ఫారెస్టు రెవెన్యూ గ్రామంలోని 529.34 ఎకరాల భూమి అటవీ భూమి కాదని ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్ తేల్చారు. దీంతో ఆ భూమి వర్గీకరణను ‘అడవి పోరంబోకు’ నుంచి ‘అస్సెస్డ్ వేస్డ్ డ్రై’గా మార్చేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. అక్కడ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆర్హులైన పేద లబ్ధిదారులకు డీకేటీ పట్టాలు పంపిణీ చేసేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
ఆ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 62 కు పెంచుతూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని కోఆపరేటివ్, సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును రెండేళ్ల పాటు పొడిగించారు. చిత్తూరు జిల్లాలోని సుమారు వెయ్యి మందికిపైగా ఉద్యోగులకు మేలు కగలనుంది.
500 మందికి ఓపీఎస్ పెన్షన్
2004 సెప్టెంబరు 1 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు సీపీఎస్ పెన్షన్ విధానం అమలులో ఉంది. వారందరినీ ఈ విధానంలోకి మార్చేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. దీంతొ జిల్లాలోని సుమారు 500 మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి ఆర్థిక భద్రత లభించనుంది.