Share News

బొగ్గుపల్లి ప్రాథమిక పాఠశాల మూత

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:41 AM

కే ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్న ఆ ప్రాథమిక పాఠశాల మూతపడింది. వీరిద్దరినీ పక్క పాఠశాలలకు పంపించారు.

బొగ్గుపల్లి ప్రాథమిక పాఠశాల మూత
ఏకైక విద్యార్థికి చదువు చెబుతున్న ఉపాధ్యాయుడు

విద్యార్థి, ఉపాధ్యాయుడు పక్క పాఠశాలలకు బదిలీ

కుప్పం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఒకే ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్న ఆ ప్రాథమిక పాఠశాల మూతపడింది. వీరిద్దరినీ పక్క పాఠశాలలకు పంపించారు. కుప్పం మండలం పైపాళ్యం పంచాయతీ బొగ్గుపల్లి ప్రాథమిక పాఠశాలను ఒకటి, రెండు తరగతులకు మాత్రం నడుపుతూ వచ్చారు. ఆపై తరగతులు పక్క గ్రామమైన బైరప్పకొటాలు ప్రాథమిక పాఠశాలలో ఉన్నాయి. బొగ్గుపల్లి గ్రామానికి చెందిన 3, 4, 5 తరగతుల పిల్లలు బైరప్పకొటాలు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. బొగ్గుపల్లి ప్రాథమిక పాఠశాలలో అదే గ్రామానికి చెందిన దర్శన్‌ అనే విద్యార్థి ఒక్కడే రెండో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థికి సురేష్‌ అనే ఉపాధ్యాయుడు చదువు చెబుతూ వచ్చారు. ఎంతగా ప్రోత్సహించినా ఆ చిన్న గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్చడానికి ముందుకు రాలేదు. అసలే కుగ్రామం. 1, 2 తరగతుల పిల్లలు ఉన్నదే సుమారు ఐదారుగురు. వీరు కూడా ఎల్‌కేజీ, యూకేజీ చదువులకు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లారు. అక్కడే 1, 2 తరగతులు కొనసాగించడంతో ఆ ప్రాథమిక పాఠశాలకు దర్శన్‌ ఒక్కడే మిగిలాడు. కాగా, 80వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆ టీచర్‌, విద్యార్థి ఇద్దరే జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పండగ జరుపుకొన్నారు. దీనిపై ‘ఒక టీచరు- ఒకే స్టూడెంట్‌’ శీర్షికన ఈనెల 16వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఈవో లక్ష్మీనారాయణ.. ఆ పాఠశాల స్థితిగతులపై కుప్పం ఎంఈవో రాజారాంను ఆరా తీశారు. చివరకు డీఈవో ఆదేశాల మేరకు దర్శన్‌ తల్లిదండ్రులను ఎంఈవో ఒప్పించి అతడిని పక్క గ్రామమైన బైరప్పకొటాలు ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. టీచర్‌ సురే్‌షను కొత్తఇండ్లు ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేశారు.

Updated Date - Aug 19 , 2026 | 01:41 AM