Share News

బీఎల్వోలకు ముచ్చెమటలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:35 AM

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోలకు ముచ్చెమటలు పడుతున్నాయి. గడువు దగ్గరొస్తుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. మరోపక్క ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీలో చూపిన జోరు.. డిజిటలైజేషన్‌లో కనిపించడంలేదని అధికారులు పెదవి విరుస్తున్నారు.

బీఎల్వోలకు ముచ్చెమటలు
వి.కోట మండలంలోని పోలింగ్‌ స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ఆర్డీవో భవానీ

నత్తనడకన సాగుతున్న సర్‌ డిజిటలైజేషన్‌

చాలా చోట్ల 30శాతం లోపు పూర్తయిన ప్రక్రియ

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోలకు ముచ్చెమటలు పడుతున్నాయి. గడువు దగ్గరొస్తుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. మరోపక్క ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీలో చూపిన జోరు.. డిజిటలైజేషన్‌లో కనిపించడంలేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో జిల్లా వెనుకబడుతోంది. జిల్లాలో 1511 మంది బీఎల్వోలు ‘సర్‌’ ప్రక్రియలో పనిచేస్తున్నారు. వీరిలో 202 మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. బుధవారం నాటికి వీరంతా 30శాతం కంటే తక్కువ డిజిటలైజేషన్‌ చేసి వెనుకబడినట్లు గుర్తించారు. తాజా సమాచారం మేరకు కుప్పం రూరల్‌ మండలం కంగుంది పరిధిలో దేవరాజపురం పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో జిల్లాలోనే అతితక్కువగా 2.38 శాతం డిజిటలైజేషన్‌ జరిగింది. మూడు చోట్ల పది శాతంలోపు, 29 పోలింగ్‌ స్టేషన్లలో 10-20 శాతం లోపు, 170 కేంద్రాల్లో 20-30 శాతంలోపు, 954 పోలింగ్‌ బూత్‌ల్లో 50శాతం కంటే తక్కువ డిజిటలైజేషన్‌ ప్రక్రియ జరిగింది. జిల్లాలో బుధవారం నాటికి 13,11,570 (97.87శాతం) మందికి ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ చేయగా 6,00,213 మంది (44.79శాతం)కి సంబంధించి డిజిటలైజేషన్‌ పూర్తిచేశారు.

సర్వర్‌ లోపాలతో తలనొప్పి

ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్వోలు స్కాన్‌చేసి యాప్‌లో అప్‌డేట్‌ చేయాల్సివుంది. ఈనెల 14లోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల సంఘం గడువు విధించింది. అప్‌లోడ్‌ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏపీఐ ఫెయిల్డ్‌ అని చూపిస్తోందని బీఎల్వోలు వాపోతున్నారు. నెట్వర్క్‌ సమస్యతో ఒక్కో ఫారం స్కానింగ్‌ చేసేందుకు ఐదు నిమిషాలకు పెగా పడుతోందంటున్నారు. ఈక్రమంలోనే త్వరితగతిన డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు కలరు ఫోటో అప్‌డేట్‌కు అడ్డంకులు ఎదురౌతున్నాయని సమాచారం.

Updated Date - Jul 02 , 2026 | 01:35 AM