Share News

భూరికార్డులకు ‘బ్లాక్‌ చెయిన్‌’ రక్ష

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:32 AM

రెవెన్యూ, సర్వే, రిజిస్ర్టేషన్‌ శాఖల్లో భూముల సమాచారం వేర్వేరుగా ఉంటోంది. డేటా వ్యత్యాసం, రికార్డుల్లో మార్పులు తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మీ భూమి- బ్లాక్‌ చెయిన్‌’ వ్యవస్థను తీసుకొచ్చింది.

భూరికార్డులకు ‘బ్లాక్‌ చెయిన్‌’ రక్ష

ఒకే వేదికపైకి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ సమాచారం

పెనుమూరు మండలంలోని 7 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

చిత్తూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, సర్వే, రిజిస్ర్టేషన్‌ శాఖల్లో భూముల సమాచారం వేర్వేరుగా ఉంటోంది. డేటా వ్యత్యాసం, రికార్డుల్లో మార్పులు తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మీ భూమి- బ్లాక్‌ చెయిన్‌’ వ్యవస్థను తీసుకొచ్చింది. పెనుమూరు మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సీఎం చంద్రబాబు గురువారం సచివాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ ఎన్‌ఐసీ, బెంగళూరులోని ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ’ సంస్థలు సంయుక్తంగా హైపవర్‌ లెడ్జర్‌ ఫ్యాబ్రిక్‌ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఇందులో ఆటోమ్యుటేషన్‌, సబ్‌ డివిజన్‌, ఎక్స్‌టెంట్‌ కరెక్షన్‌ సహా 8 పౌర సేవలు అందించనున్నారు. భూ రికార్డులను మార్చాలంటే ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్‌ సేవల ద్వారానే చేయాలి. ఒక భూ పార్సెల్‌కు సంబంధించిన అన్ని లావాదేవీలు వాటి వెర్షన్‌ శాశ్వతంగా నమోదవుతాయి. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రతి భూ పార్శిల్‌కూ ప్రత్యేక బ్లాక్‌ చెయిన్‌ గుర్తింపు (డిజిటల్‌ ఐడీ)ని కేటాయిస్తారు. డబుల్‌ రిజిస్ర్టేషన్లను పూర్తిగా నివారించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సాంకేతికత ద్వారా భూ రికార్డుల్లో ఒక్కసారి లావాదేవీ జరిగితే దాన్ని అక్రమంగా మార్చడం లేదా ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యం. ఏదైనా అధికారి మార్పులు చేస్తే.. ఏ అధికారి, ఏ సమయంలో మార్చారో స్పష్టమైన ఆధారాలు శాశ్వతంగా నమోదై ఉంటాయి. రికార్డుల్లో తేడాలుంటే ఆన్‌లైన్‌ లావాదేవీ ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది.

ఆ గ్రామాలు ఏవంటే..

రాష్ట్రంలో ఏడు జిల్లాల్లోని 89 గ్రామాల్లో ‘మీ భూమి- బ్లాక్‌ చెయిన్‌’ను పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా, అందులో పెనుమూరు మండలంలోని 7 గ్రామాలున్నాయి. సీఎస్‌ అగ్రహారం, తాతిరెడ్డిపల్లె, అమ్మగారిపల్లె, శాతంబాకం, కలికిరి, మోపిరెడ్డిపల్లె, కొండమ్మ అగ్రహారం గ్రామాల్లో అమలు చేయనున్నారు.

రాబోయే రోజుల్లో విస్తరిస్తాం

భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయాల్సి వచ్చినా ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ లేదా ఫోన్‌కాల్‌ ద్వారా భూ యజమానికి ముందుగా సమాచారం అందుతుంది. రిజిస్ర్టేషన్‌కు ముందే 1బీ, ఈసీ, యాజమాన్య చరిత్రను పారదర్శకంగా సరిచూసుకునే వెసలుబాటు ఉంది. దీంతో నకిలీ రిజిస్ర్టేషన్లు, వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో అక్రమ మార్పుల్ని అరికట్టొచ్చు. రాబోయే రోజుల్లో ఈ పైలెట్‌ ప్రాజెక్టు పనితీరును సమగ్రంగా అధ్యయనం చేసి అవసరమైన మెరుగుదల చేశాక 50 శాతం గ్రామాల్లోకి విస్తరిస్తాం.

- సుమిత్‌కుమార్‌, కలెక్టర్‌

Updated Date - Jul 24 , 2026 | 12:32 AM