Share News

కలెక్టరేట్‌కు చేరిన బీఎల్వో కిట్లు

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:52 AM

చిత్తూరు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌- ‘సర్‌’)కు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. బూత్‌ స్థాయి అధికారుల (బీఎల్వో) కిట్లు సోమవారం కలెక్టరేట్‌కు చేరాయి.

 కలెక్టరేట్‌కు చేరిన బీఎల్వో కిట్లు
కలెక్టరేట్‌కు చేరిన బీఎల్వో కిట్లు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌- ‘సర్‌’)కు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. బూత్‌ స్థాయి అధికారుల (బీఎల్వో) కిట్లు సోమవారం కలెక్టరేట్‌కు చేరాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు (ఈఆర్వో, ఏఈఆర్వో)లకు మంగళ, బుధవారాల్లో ఈ సామగ్రిని కలెక్టరేట్‌ యంత్రాంగం ద్వారా అందిస్తారు. ఈ కిట్లలో 13 రకాల వస్తువులు ఉంచారు. టోపీ, గొడుగు, వాటర్‌ బాటిల్‌, రైటింగ్‌ ప్యాడ్‌, పెన్‌, పెన్సిల్‌, రబ్బర్‌, షార్పనర్‌, రూలర్‌, ఓటరు నమోదు, మృతుల పేర్లు తొలగింపు, మార్పులు చేర్పులు వంటి వాటికోసం 6, 7, 8 ఫారాలు తదితర వస్తువులు ఉంచారు. పోలింగ్‌ కేంద్రానికి ఒక్కరు చొప్పున 1,776 మంది బీఎల్వోలు పనిచేస్తున్నారు. ఈనెల ఐదున వీరికి మొదలైన శిక్షణ కార్యక్రమాలు 14వ తేదీవరకు జరగనున్నాయి. 1,776 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 7,76,513 మంది పురుషులు, 8,04,028 మంది మహిళలు, 71 మంది ఇతరులు వెరసి మొత్తం 15,80,612 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలావుండగా రేపో, మాపో ఓటర్లకు ఇచ్చేందుకోసం ఎన్యుమరేషన్‌ ఫారాలు కలెక్టరేట్‌కు రానున్నాయి. వీటిని బీఎల్వోల ద్వారా ఈ నెల 15 నుంచి ఇంటింటికి పంపిణీ చేయనున్నారు.

‘సర్‌’ కోసం హెల్ప్‌డెస్క్‌

‘సర్‌’ ప్రక్రియలో ఓటర్లకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌ బృందాలు ఏర్పాటయ్యాయి. అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరు జాబితాలో చేర్చేందుకు, ముఖ్యంగా దివ్యాంగులు, వలస.. వృద్ధ ఓటర్ల సౌకర్యార్థం ఇవి పనిచేస్తాయి. ఈ హెల్ప్‌డె్‌స్కలు నెం.1950 ద్వారా కూడా ప్రజలకు సేవలు అందిస్తాయని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 09 , 2026 | 01:52 AM