Share News

కార్వేటినగరంలో బర్డ్‌ఫ్లూ?

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:57 AM

కార్వేటినగరం మండలం ఆర్కేవీబీ పేట పంచాయతీ ఇందిరాకాలనీలోని కోళ్లఫారంలో ఆదివారం వందలాదిగా కోళ్లు చనిపోయాయి. ఈ విషయం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ దృష్టికి వెళ్లడంతో తక్షణ చర్యలకు ఆదేశించారు.

కార్వేటినగరంలో బర్డ్‌ఫ్లూ?
ఇందిరా కాలనీలో కోళ్ల ఫారం వద్ద పశు సంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి

వెదురుకుప్పం/చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కార్వేటినగరం మండలం ఆర్కేవీబీ పేట పంచాయతీ ఇందిరాకాలనీలోని కోళ్లఫారంలో ఆదివారం వందలాదిగా కోళ్లు చనిపోయాయి. ఈ విషయం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ దృష్టికి వెళ్లడంతో తక్షణ చర్యలకు ఆదేశించారు. పశుసంవర్థకశాఖ డాక్టర్లు, ఉద్యోగులతో కలిసి జేడీ డాక్టర్‌ ఉమామహేశ్వరి ఆదివారం ఇందిరా కాలనీలోని కోళ్లఫారానికి చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సామూహిక కోళ్ల మరణాలకు గల కారణాలపై ప్రాథమిక విచారణ చేపట్టారు. వీటిలో ఏవీఎన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) లక్షణాలు కనిపించినట్లు ఆమె తెలిపారు. ప్రాథమికంగా బర్డ్‌ఫ్లూ అని నిర్ధారించి చర్యలు చేపట్టారు. తక్షణ ప్రొటోకాల్‌ ప్రకారం నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ డిసీజెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎ్‌సఏడీ)కు పంపారు. నివేదికలు వచ్చే వరకు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని పౌలీ్ట్ర రైతులకు, ప్రజలకు సూచించారు. కాగా, మూడు రోజులుగా సుమారు మూడు వేల కోళ్ల వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. వ్యాప్తిని నిరోధించడానికి నియంత్రణ, జీవభద్రతా చర్యలను అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలంటూ ఫారం యజమాని ఎం.గోపినాథ్‌కు నోటీసు అందజేశారు. ఫారం లోపలకు బయటి వ్యక్తులను, వాహనాలను అనుమతించరాదని హెచ్చరించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు గుడ్లు, ఎరువు, మేత తరలింపు.. పౌల్ర్టీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించారు. ఫారాల్లోని కోళ్లు అసాధారణంగా చనిపోయినా, శ్వాసకోస ఇబ్బందులు (గురక, ముక్కు వెంట నీరు కారడం) గమనించినా వెంటనే సమీపంలోని వెటర్నరీ డిస్పెన్సరీ లేదా పశు వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఆ ఫారం నుంచి సుమారు కిలోమీటరు పరిధిలోని రైతులు కూడా తమ కోళ్లలో గొంతు వాపు, శ్వాసకోశ ఇబ్బందులు తదితర లక్షణాలను గమనిస్తూ ఉండాలన్నారు. కోళ్ల అనుమానిత మరణాలు, ఇతర సమాచారం కోసం పశువైద్యాధికారులు డాక్టర్‌ హేమకుమార్‌ (99597 63573), డాక్టర్‌ కృష్ణ (93903 18814) సంప్రదించాలన్నారు.

వండిన చికెన్‌తో ప్రమాదం లేదు

వండిన చికెన్‌, గుడ్లు తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని పశువైద్యాధికారులు చెబుతున్నారు. వీటిని 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది మనుషులకు సోకదు

‘బర్డ్‌ఫ్లూ (ఏవీఎన్‌ ఇన్‌ఫ్లుయెంజా) కోళ్ల నుంచి కోళ్లకు మాత్రమే వ్యాపిస్తుంది. ఇది మనుషులకు సోకదు. అందువల్ల పౌల్ర్టీ రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద సంఖ్యలో కోళ్లు మరణిస్తే పశుసంవర్థకశాఖ (70131 19447), కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూం (08572 242730)కు సంప్రదించాలని సూచించారు.

బాధిత రైతులకు పరిహారం!

‘కోళ్ల మరణాల వల్ల నష్టపోయిన పౌలీ్ట్ర రైతు అధైర్య పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ భోపాల్‌ ల్యాబ్‌ నివేదికలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయి, నిబంధనల ప్రకారం కోళ్లను నిర్మూలించాల్సి వస్తే బాధిత రైతులకు పరిహారం అందేలా చూస్తాం’ అని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ దామోదరనాయుడు తెలిపారు. కార్వేటినగరం మండలం ఇందిరా కాలనీ, ఆర్‌.కె.వి.బి పేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటించారు. పౌలీ్ట్ర ఫారాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం జేడీ, మండల పశువైద్య సిబ్బందితో ఆయన సమీక్షించారు. శాంపిల్స్‌ నివేదిక వచ్చే వరకు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించాలన్నారు. పరిహారానికి సంబంధించి అవసరమైన రైతుల వివరాలు, పౌలీ్ట్ర ఇన్వెంటరీని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బయో- సెక్యూరిటీ చర్యలు చేపట్టాలన్నారు. రైతులు అధికారులకు సహకరించి వ్యాధి నియంత్రణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

వెదురుకుప్పంలో అప్రమత్తం

బర్డ్‌ప్లూ సస్పెక్ట్‌ బయట పడటంతో వెదురుకుప్పం మండలంలో అప్రమత్తమయ్యారు. పౌల్ర్టీ రైతులు పశుసంవర్థకశాఖ సూచనలు పాటించాలని పశుసంవర్థకశాఖ వైద్యాధికారి డాక్టర్‌ రాజేష్‌ ఆదేశించారు.

Updated Date - Feb 09 , 2026 | 01:57 AM