కార్వేటినగరంలో బర్డ్ ఫ్లూనే
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:00 AM
కార్వేటినగరం మండలంలో వందలాది కోళ్లు చనిపోయింది బర్డ్ ఫ్లూతోనే అని నిర్ధారణ అయింది. ఈ మేరకు భోపాల్‌లోని ఐసీఏఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ డైరెక్టర్ ఎ.సన్యాల్ నిర్ధారించారు. దీంతో బుధవారం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
ఐసీఏఆర్ నిర్ధారణ
మృతిచెందినవి 1873 కోళ్లు
పశు సంవర్ధకశాఖ చంపినవి 11,225
వెదురుకుప్పం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): కార్వేటినగరం మండలంలో వందలాది కోళ్లు చనిపోయింది బర్డ్ ఫ్లూతోనే అని నిర్ధారణ అయింది. ఈ మేరకు భోపాల్‌లోని ఐసీఏఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ డైరెక్టర్ ఎ.సన్యాల్ నిర్ధారించారు. దీంతో బుధవారం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్కేవీబీపేట గ్రామ పంచాయతీ ఇందిరాకాలనీలోని గోపినాథ్ కోళ్ల ఫారంలో కోళ్లు వరుసగా చనిపోయిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ అనుమానంతో నమూనాలను భోపాల్ ల్యాబ్‌కు పంపి.. ఆదివారం నుంచి నిషేధిత చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూనే అని బుధవారం ఐసీఏఆర్ నిర్ధారించింది. కాగా, గోపినాథ్ కోళ్ల ఫారంలో ఇప్పటివరకు 1873 కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయాయని పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. మంగళవారం వరకు 1780 కోళ్లు.. బుధవారం మరో 93 కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో జేడీ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఆరు రాపిడ్ బృందాలు గ్రామానికి చేరుకున్నాయి. బతికున్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని బతికున్న 11,225 కోళ్లను చంపి పూడ్చేశారు. ఇందులో గోపినాథ్ కోళ్ల ఫారంలో 5125 కోళ్లు.. ఇక్కడ్నుంచి కిలో మీటరు దూరంలోని మరొకరి కోళ్ల ఫారంలో బతికున్న 6100 కోళ్లను చంపి పాతిపెట్టారు. ఇతరత్రా చర్యలు తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పశుసంవర్థకశాఖ జేడీతో పాటు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి.గోవిందయ్య, ఏడీ డాక్టర్ ఆర్.వాసు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టరు హేమకుమార్, కృష్ణ, సుబ్రహ్మణ్యం, నరేష్, శివమూర్తి, జగదీష్, యషితప్రియ, రాజేష్, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో చంద్రమౌళి, ఆర్‌ఐ నరసింహులు, ఇతర ఉద్యోగులు కోళ్లఫారాన్ని పరిశీలించారు.
భయాందోళనలు వద్దు
బర్డ్ ఫ్లూపై ప్రజలు భయాందోళన చెందొద్దు. ఇందిరా కాలనీలోని గోపినాథ్ కోళ్ల ఫారంలో మాత్రమే బర్డ్ ఫ్లూ ఉంది. జిల్లాలో ఇంకెక్కడా లేదు. నిబంధనల ప్రకారం చర్యలన్నీ చేపట్టాం. చికెన్, గుడ్డు బాగా ఉడకబెట్టి తినొచ్చు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇందిరాకాలనీ ప్రాంతంలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయి.
- డాక్టర్ ఉమామహేశ్వరి, పశు సంవర్థకశాఖ జేడీ