మనుషులకూ బర్డ్‌ఫ్లూ!
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:24 AM
జాగ్రతలు పాటించాలంటున్న వైద్య నిపుణులు
చిత్తూరు రూరల్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటి వరకు మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకలేదు. కానీ, నిర్లక్ష్యంగా ఉంటే వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే దీన్నుంచి బయట పడొచ్చని సూచిస్తున్నారు. మన దేశంలో ఉండే అనువైన వాతావరణం దృష్ట్యా ఏటా విదేశీ పక్షులు వలస స్తుంటాయి. ముఖ్యంగా సెప్టెంబరు నుంచి మార్చి వరకు వచ్చే వలస పక్షుల ద్వారా ఇతర పక్షులు, జంతువులతో పాటు మానవులకు వైరస్ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ సోకిన పక్షులను నేరుగా ముట్టుకోవడం, వాటి పరిసరాలు, వైరస్ సోకిన పక్షుల (కోళ్లు) మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినడం ద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ వైరస్ బతకలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందుకే బాగా ఉడికించిన మాంసం ద్వారా వైరస్ సోకే ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మనుషులకు వైరస్ సోకితే సాధారణ ఫ్లూ, జ్వరం, గొంతునొప్పి.. వంటి కొవిడ్ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.
కొన్ని రోజులు వీటిని తినొద్దు
బర్డ్‌ఫ్లూ వైరస్ కట్టడి అయ్యేవరకు గ్రిల్ చికెన్(కాల్చిన చికెన్), కోడిగుడ్డు ఆఫ్‌బాయిల్ తినడం మానాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బాడీబిల్డింగ్ చేసే వారే ఎక్కువగా ఆఫ్‌బాయిల్ తింటుంటారని చెప్పారు. దీని ద్వారా బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకుతుందని తెలిపారు.
మూడు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మూడు క్వారంటైన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇవి సదుంలోని టీటీడీ కల్యాణ మండపం.. కార్వేటినగరంలోని రైతుభరోసా కేంద్రం.. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్నాయి. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లఫారంలో పనిచేసిన వ్యక్తులను, చనిపోయిన కోళ్లను పూడ్చిన వారిని, వారితో సంబంధాలున్న వారిని ఈ క్వారంటైన్‌లో 10 రోజులు పాటు ఉంచి చికిత్సలు అందిస్తారు. తిరిగి పరీక్షలు చేసి బర్డ్‌ఫ్లూ లేదని నిర్ధారణ అయ్యాక వదిలిపెడుతున్నట్లు ఎపిడమాలజిస్ట్ శ్రీవాణి తెలిపారు. ఇప్పటి వరకు 30 మందికిపైగా పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చిందన్నారు. కాగా, చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ముందు జాగ్రత్త చర్యగా 6 పడకలతో క్వారంటైన్ వార్డును ఏర్పాటు చేశామని ఎంఎస్ ఉషశ్రీ తెలిపారు. ఇక్కడ మందులను అందుబాటులో ఉంచారు.
బర్డ్‌ఫ్లూ లక్షణాలతో వ్యక్తి చేరిక
ఇటీవల కార్వేటినగరంలో ఉన్నట్టుండి అనేక కోళ్లు చనిపోయాయి. బర్డ్‌ఫ్లూ అనుమానంతో వాటి నమూనాలను అధికారులు ఓ ల్యాబ్ అసిస్టెంట్ ద్వారా ఈనెల 6వ తేదీన భోపాల్ ల్యాబ్‌కు పంపారు. ఆ నమూనాలను అక్కడ అప్పగించి 9వ తేదీన ఆ ఉద్యోగి వచ్చారు. అప్పట్నుంచి డ్యూటీకి రాలేదు. విధుల్లో చేరాలని అధికారి ఆదేశించడంతో.. తనకు జ్వరం, గొంతునొప్పి అని బర్డ్‌ఫ్లూ లక్షణాలు చెప్పారాయన. వెంటనే అతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి క్వారంటైన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి శాంపిల్స్ తీసి స్విమ్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అతడి ఆరోగ్యం బాగుందని, కోళ్ల శాంపిల్స్ తీసుకెళ్లిన వ్యక్తి కావడంతో ముందుజాగ్రతగా క్వారంటైన్‌లో ఉంచి అబ్జర్వేషన్‌లో ఉంచామని చిత్తూరు జీహెచ్ ఎంఎస్ తెలిపారు. పరీక్షల రిజల్ట్స్ బుధవారం సాయంత్రం వస్తుందని, అప్పటి వరకు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనన్నారు.