నేటి నుంచి మూడు రోజులపాటు పక్షుల పండుగ
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:12 AM
సూళ్లూరుపేటకు పక్షుల పండగొచ్చింది. పులికాట్, నేలపట్టుకు వచ్చే వలస పక్షుల ప్రాముఖ్యతను తెలుపుతూ శనివారం నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యే విజయశ్రీ బెలూన్ ఎగురవేసి ఈ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారు. పులికాట్‌కు వలసొచ్చే పక్షుల్లో అరుదైన ఫ్లెమింగో పేరిట 2001 నుంచి ఏటా (వైసీపీ హయాంలో నాలుగేళ్లు మినహా) ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
తడ/సూళ్లూరుపేట, జనవరి 9 (ఆంఽధ్రజ్యోతి): సూళ్లూరుపేటకు పక్షుల పండగొచ్చింది. పులికాట్, నేలపట్టుకు వచ్చే వలస పక్షుల ప్రాముఖ్యతను తెలుపుతూ శనివారం నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యే విజయశ్రీ బెలూన్ ఎగురవేసి ఈ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారు. పులికాట్‌కు వలసొచ్చే పక్షుల్లో అరుదైన ఫ్లెమింగో పేరిట 2001 నుంచి ఏటా (వైసీపీ హయాంలో నాలుగేళ్లు మినహా) ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సూళ్లూరుపేట వేదికగా జరిగే పక్షుల పండుగలో భాగంగా నేలపట్టు, బీవీపాళెం, అటకానితిప్ప, ఇరకందీవి, శ్రీసిటీ, ఉబ్బలమడుగుల్లోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నేలపట్టు, అటకానితిప్ప వ్యూపాయింట్ల వద్ద సందర్శకులు పక్షులను చూసేందుకు పెద్ద ఎత్తున బైనాక్యూలర్లను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది విద్యార్థులు ఈ పండుగను వీక్షించేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఫ్లెమింగో సంబరానికి ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 24 మంది ఎస్‌ఐలు, 400 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక, పక్షుల పండుగకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీసీఎఫ్ సెల్వం శుక్రవారం సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పక్షుల పండుగ ముగింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వస్తారని కలెక్టర్ వెంకటేశ్వర్ మీడియాకు తెలిపారు. అయితే, అదే రోజు ముఖ్య సమావేశం ఉండటంతో శుక్రవారం రాత్రికి ఆ పర్యటన రద్దయింది. కాగా, ఈ ఏడాది రెండు రోజులపాటే ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించినా, ఎమ్మెల్యే, స్థానికుల సూచనల మేరకు మూడో రోజూ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరితోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, వివిధశాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కార్యక్రమాల్లో నేడు
ఉదయం 9 గంటలు: సూళ్లూరుపేట హోలిక్రాస్ సర్కిల్ నుంచి కళాశాల మైదానం వరకు శోభాయాత్ర
9.30-12: పక్షుల పండుగ.. స్టాళ్ల ప్రారంభం
5 గంటలకు: సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లెమింగో పై పాటకు నృత్య ప్రదర్శన. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షితకేంద్రం, సరస్సులో వేట విన్యాసాలపై వీడియో ప్రదర్శన. లైటింగ్‌ల్యాంప్
6.30: ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఆవిష్కరణ
7 గంటలకు: అతిథుల ప్రసంగాలు
7.30 నుంచి రాత్రి 10 వరకు: పాటకచ్చేరి, నృత్య ప్రదర్శన.