Share News

10 నుంచి బిల్లుల ఫ్రీజింగ్‌

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:14 AM

కొన్నింటికి మాత్రం మినహాయిపు

10 నుంచి బిల్లుల ఫ్రీజింగ్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రాబడి, ఆదాయం తగ్గుముఖం పట్టడంతో జిల్లా ఖజానాశాఖ బిల్లుల స్వీకరణ, పాసింగ్‌ ఆర్డర్‌, చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర ఖజానా కార్యాలయ ఉత్తర్వుల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు అందిన బిల్లులు మాత్రం ఓకే చేసింది. మిగిలిన వాటిలో కొన్ని ఖాతాల హెడ్‌లను ఫ్రీజింగ్‌లో ఉంచింది. అత్యవసర బిల్లుల మినహా మిగిలిన వాటి స్వీకరణతో పాటు చెల్లింపులపై ఆంక్షలు పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 65 శాఖలు పనిచేస్తున్నాయి. వీటికి ప్రభుత్వం 2025-26 వార్షికానికి కేటాయించిన బడ్జెట్‌ ద్వారా ఇంతవరకు జరిపిన చెల్లింపులు బేరీజు వేసుకుని మార్చి 31వ తేదివరకు ఏరోజుకారోజు జరిగే చెల్లింపుల విషయంలో జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రశీదులకు సంబంధించి జరిగిన ఖర్చులను నియంత్రించడానికి, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ కసరత్తును క్రమబద్ధంగా తయారుచేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు చెందిన బిల్లులు చెల్లించే విషయానికి వచ్చేసరికి ఆర్థిక లోటును ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని పలు ఉద్యోగసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు, ఆర్థిక అవసరాలకోసం పెట్టుకున్న బిల్లుల స్వీకరణకు గడువు విధించడంతో ఆ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ విధానం ద్వారా చేపడుతున్నారు. ప్రతినెలా షెడ్యూలు మేర అన్ని శాఖల బిల్లులు హుజూర్‌ ఖజానా కార్యాలయం నుంచి విడుదలవుతాయి. సబ్‌ట్రెజరీలో బిల్లులన్నీ మంజూరవుతుంటాయి. ఈ నెల 10 నుంచి స్వీకరణ, చెల్లింపులు ఆంక్షలకు గురయ్యాయి. వీటిలో ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌ బిల్లులు, టీఏ, కార్యాలయ నిర్వహణ, టెలిఫోన్‌, సర్వీస్‌ పోస్టేజ్‌, స్టేషనరీ బిల్లులూ ఉన్నాయి. ఈనెల 10వ తేది తర్వాత అందిన విద్యుత్‌ బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు, ఆర్జిత బిల్లుల స్వీకరణకు ఫ్రీజింగ్‌ ఎదురైంది.

ఈ బిల్లులకు మినహాయింపులు

ప్రకృతి వైపరీత్యాలు, కోర్టు, చట్టపరమైన విషయాలకు సంబంధించిన చెల్లింపులకు ఫ్రీజింగ్‌ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం మెమో జారీచేసింది. గౌరవవేతనం, కార్పొరేషన్ల జీతాల బిల్లులు, ఐటీ, జీఎస్టీ, ఏపీఎస్డీసీ మొదలైన చట్టబద్ధమైన బిల్లులు, ఎఫ్‌సీ గ్రాంట్లు, నాబార్డు, ఖనిజ అభివృద్ధి నిధి వంటి స్థానిక సంస్థల సొంత నిధులకు సంబంధించిన బిల్లులకు ఫ్రీజింగ్‌ నుంచి మినహాయింపునిచ్చింది. ఇంకా 010, 020, 040, 060, 070, 130/134, 200, 208, 200/209, 240, 241, 280, 290, 300, 310 /311, 370, 450, 560 /561, లోన్‌ సర్వీసింగ్‌ బిల్లులు వంటి బిల్లుల చెల్లింపులకు.. డైట్‌ పింఛన్‌ గ్రాట్యూటీ కమ్యూటేషన్‌, అంగన్వాడీ వేతనాలు, స్కాలర్‌షిప్‌ వంటి బిల్లులు ఫ్రీజింగ్‌ నుంచి మినహాయింపు పొందిన వాటిలో ఉన్నాయి.

Updated Date - Feb 16 , 2026 | 01:14 AM