Share News

ఏసీబీ వలలో పెద్ద చేప

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:25 AM

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎ్‌సవై) లబ్ధిదారు నుంచి లంచం తీసుకునే వ్యవహారంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో పెద్ద చేప
లంచంగా తీసుకున్న రూ.3లక్షల నగదుతో ఫిషరీస్‌ జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ (ఎడమ), నాగరాజు (కుడివైపు)

అధికారులకు పట్టుబడ్డ జిల్లా మత్స్యశాఖ అధికారి

సబ్సిడీ బిల్లు మంజూరుకు రూ.4.50 లక్షల డిమాండ్‌

ఫిషరీస్‌ డీపీఎం కిరణ్‌కుమార్‌,మరో వ్యక్తి కూడా అరెస్ట్‌

కడప, నెల్లూరుల్లోనూ సోదాలు

తిరుపతి(నేరవిభాగం), జూలై 3 (ఆంధ్రజ్యోతి):ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎ్‌సవై) లబ్ధిదారు నుంచి లంచం తీసుకునే వ్యవహారంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతోపాటు ఫిషరీస్‌ జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, మరో వ్యక్తి నాగరాజును అరెస్ట్‌ చేశారు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్లం ప్రాంతానికి చెందిన పచ్చిపాల హిమబిందు పీఎంఎంఎ్‌సవై కింద చేపల పెంపకం యూనిట్‌ ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకున్నారు. మత్స్యశాఖ అధికారులు స్థల పరిశీలన జరిపి, రూ.50 లక్షల విలువైన ఈ ప్రాజెక్టుకు రూ.30లక్షల ప్రభుత్వ సబ్సిడీ మంజూరు ప్రక్రియను ప్రారంభించారు. సబ్సిడీ నిధులను మంజూరు చేయించడానికి జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎ్‌ఫవో) రెడ్డయ్య, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ (డీపీఎం) కిరణ్‌ కుమార్‌ బాధితురాలిని లంచం డిమాండ్‌ చేశారు. సబ్సిడీలో 15 శాతం అంటే.. రూ.4.50 లక్షలు ఇవ్వాలన్నారు. అందులో భాగంగా మొదట రూ.3లక్షలు చెల్లించాలని, మిగతా రూ.1.50 లక్షలు బిల్లు పూర్తిగా పాస్‌ అయ్యాక ఇవ్వాలని చెప్పారు. అందుకు ఒప్పుకుంటేనే సబ్సిడీ బిల్లును పాస్‌ చేయిస్తామని స్పష్టం చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక హిమబిందు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆధారాలన్నీ పరిశీలించాక ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రెడ్డయ్యకు నమ్మకస్తుడైన నాగరాజు అనే వ్యక్తికి తిరుపతి అన్నారావు సర్కిల్‌ వద్ద రూ.3లక్షల లంచం నగదును అందజేయాలని శుక్రవారం హిమబిందుకు డీపీఎం కిరణ్‌ కుమార్‌ సూచించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఏసీబీ అధికారులు.. అన్నారావు సర్కిల్‌ వద్ద రూ.3లక్షల లంచం డబ్బును నాగరాజు తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో జిల్లా మత్స్యశాఖ అధికారి రెడ్డయ్య, డీపీఎం కిరణ్‌ కుమార్‌ కోసమే తాను డబ్బు తీసుకున్నట్లు నాగరాజు అంగీకరించాడని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కడపలోని డీఎ్‌ఫవో రెడ్డయ్య నివాసంలోనూ, నెల్లూరులోని నాగరాజు నివాసంలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

రహస్య దర్యాప్తు చేసిన కడప ఏసీబీ అధికారులు

రెడ్డయ్య గతంలో కడప జిల్లా ఫిషరీస్‌ అధికారిగా పనిచేశారు. నెలరోజుల కిందట తిరుపతి జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆయన ఇలాగే లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కడప ఏసీబీ అధికారులు రహస్యంగా దర్యాప్తు చేశారు. తదుపరి చర్యలకోసం నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఇంతలోనే తిరుపతిలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

మరికొందరు బాధితుల ఫిర్యాదు

ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో, ఇదే పథకం కింద లబ్ధి పొందిన మరో ముగ్గురు లబ్ధిదారులు కూడా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సబ్సిడీల కోసం తాము కూడా ఈ అధికారులకు లక్షల రూపాయలు లంచాలు చెల్లించామని ఫిర్యాదు చేశారు. నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. దాడుల్లో డీఎస్పీ సీతారామరావు, ఇన్స్‌పెక్టర్లు మల్లికార్జున, నరసింహారావు, విద్యాసాగర్‌, వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 01:25 AM