ఫోర్టిఫైడ్ రైస్‌కు స్వస్తి..!
ABN , Publish Date - Aug 10 , 2026 | 02:06 AM
ప్రజావసరాలకు సరఫరా చేసే ఫోర్టిఫైడ్ రైస్‌కు ప్రభుత్వం స్వస్తి పలికింది. వివిధ పథకాల కింద ఉచితంగా, రాయితీతో సరఫరా చేసే బియ్యంలో పోషకాలు కలిపి సరఫరా చేస్తున్నారు. వచ్చేనెల నుంచి వీటిని నిలిపేస్తున్నారు.
ప్రజా పంపిణీలో పోషకాలు లేనట్లే
సకాలంలో సరఫరాకు నిర్ణయం
ప్రజావసరాలకు సరఫరా చేసే ఫోర్టిఫైడ్ రైస్‌కు ప్రభుత్వం స్వస్తి పలికింది. వివిధ పథకాల కింద ఉచితంగా, రాయితీతో సరఫరా చేసే బియ్యంలో పోషకాలు కలిపి సరఫరా చేస్తున్నారు. వచ్చేనెల నుంచి వీటిని నిలిపేస్తున్నారు.
మదనపల్లె, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సాధారణ బియ్యంలో పోషకాలు, ఖనిజాలు కలిపే ప్రక్రియను ఫోర్టిఫైడ్ అంటారు. మిల్లర్ల నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సేకరించిన బియ్యంలో పోషకాలు కలిపి బస్తాల్లో నింపి రైలు వ్యాగన్లలో స్టేజ్-1కు, అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్ల(ఎంఎల్‌ఎ్‌స)కు స్టేజ్-2కు లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో చౌకదుకాణాలు, అంగన్వాడీలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం వడ్డించే పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. ఎఫ్‌సీఐ, మిల్లర్లు ద్వారా బియ్యం సరఫరా ఆలస్యం అవుతుండటంతో ఫోర్టిఫైడ్ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు చెబుతున్నారు. జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు డివిజన్లలోని 25 మండలాల్లో మొత్తం 992 చౌకదుకాణాల పరిధిలో ఐదు లక్షల కార్డులున్నాయి. వీటికి మదనపల్లె, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, పుంగనూరు, వాల్మీకిపురం, పీలేరు, సదుం, కలకడ, చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లెలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేస్తున్నారు. అలాగే అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. వీటికి ప్రతినెలా 7,200 మెట్రిక్ టన్నుల బియ్యం, 470 టన్నుల చక్కెర, 440 టన్నుల గోఽధుమ పిండి సరఫరా చేస్తున్నారు.
సాధారణ బియ్యంలో ఖనిజ లవణాలు మిక్సింగ్
విటమిన్లు, ఖనిజ లవణాలను కలిపి బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్‌గా సరఫరా చేస్తున్నారు. పోషకార లోపాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీల ద్వారా పంపిణీ చేస్తోంది. ముందుగా బియ్యపు పిండిలో ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్-బి12 వంటి సూక్ష్మ పోషకాలను కలిపి ప్రత్యేక యంత్రాల ద్వారా బియ్యం గింజల ఆకారంలో తయారు చేస్తారు. వీటిని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. సుమారు వంద కిలోల బియ్యానికి ఒక కిలో నిష్పత్తితో కలుపుతారు. తద్వారా రక్తహీనత తగ్గడంతోపాటు శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి12ను అందిస్తుంది. వీటిని సెప్టెంబరు నుంచి పూర్తిగా నిలిపేయనుందని అధికారులు చెబుతున్నారు.
సమయం ఆదా కోసమే..
వరి కోతల అనంతరం ఎండబెట్టిన వరి ధాన్యాన్ని మరపట్టించి ఆయా పథకాలకు సరఫరా చేయనున్నారు. తద్వారా సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు మూడు కేజీల ప్యాకింగ్‌తో సరఫరా చేస్తున్న బియ్యానికి స్వస్తి పలికారు. ప్యాకింగ్ లేకుండానే పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఫోర్టిఫైడ్‌కు అమలు చేయనున్నారు. ప్రజా పంపిణీలో ఆగస్టులో సగం రా రైస్, సగం ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేశారు. సెప్టెంబరు నుంచి పూర్తిగా తీసేసి రా రైస్ సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.