3,989 చేనేత కుటుంబాలకు రూ.9.97 కోట్ల లబ్ధి
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:22 AM
చేనేత కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వారికి ఎంతో ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకం అమలు చేస్తోంది. తాజాగా నేతన్నకు ఆర్ధికంగా అండగా నిలిచేలా ఎన్టీఆర్ చేనేత భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది.
తిరుపతి(కలెక్టరేట్), జూలై 18 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వారికి ఎంతో ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకం అమలు చేస్తోంది. తాజాగా నేతన్నకు ఆర్ధికంగా అండగా నిలిచేలా ఎన్టీఆర్ చేనేత భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు ఏడో తేదీన ఈ పథకాన్ని అమలుచేయనుంది. దీనికి సంబంఽధించిన కసరత్తును ఇప్పటికే చేనేత, జౌళిశాఖ పూర్తిచేసింది. ఈపథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. గత వైసీపీప్రభుత్వ హయాంలో అనుబంధ రంగాలకు చెందిన వారికి ఆర్ధికసాయం అందించకుండా పక్కన పెట్టారు. దీనిపై వినతులు రావడంతో చేనేతకు అనుబంధంగా ఉండే రాట్నం వడకడం, రంగులు అద్దడం తదితర రంగాల వారికి కూడా ఈ పథకం వర్తించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబానికి ఏడాదికి రూ.25వేల చొప్పున ఆర్ధిక సాయం
ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25వేల చొప్పున అందించేలా సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో జిల్లాలో ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న చేనేత మగ్గాలు 2,645 కాగా, పవర్‌లూమ్స్ 1,344 ఉన్నాయి. మొత్తం 3,989 కుటుంబాలకు ఈ కుటుంబాలకు ఏడాదికి రూ.9.97కోట్లు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో నారాయణవనం, వెంకటగిరి, శ్రీకాళహస్తి, బీఎన్‌కండ్రిగ, సత్యవేడు మండలాల్లో అత్యధికంగా చేనేత రంగాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 3,989మంది ఉండగా, చిత్తూరుజిల్లాలో 3,227 చేనేత కుటుంబాలు ఇప్పటికే ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్నారని చేనేత, జౌళిశాఖ ఏడీ విజయానంద్ విజయానంద్ తెలిపారు.