పీఎండీఎస్ వ్యవసాయంతో లాభాలెన్నో..!
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:47 AM
ప్రకృతి వ్యవసాయానికి అనుసంఽధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎండీఎస్ విధానం జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తోంది. సాధారణంగా వేసవికి ముందుగానే పొలాలు బీడు పెట్టకుండా ఈ విధానంతో 30 రకాల విత్తనాలతో మిశ్రమపంట సాగు చేస్తారు. బీడు భూములను ఒకసాలు దుక్కి దున్నాక విత్తన గుళికలు చల్లుతారు. వాతావరణంలో కొద్దిపాటి తేమ(మంచు) ఉన్నా, కేవలం 5 ఎంఎం వర్షపాతం కురిసినా చాలు ఈ విత్తనాలు మొలకెత్తుతాయి.
భూమిలో తేమశాతం నిల్వకు ఉపకారం
జిల్లాలో వర్షాకాలం ప్రారంభమైనా వానల జాడలేదు. వేరుశనగ సాగుకు దుక్కులు దున్నిన పొలాల్లో తేమశాతం తగ్గిపోయి బెట్టబారుతున్నాయి. ఈ తరుణంలో చేపట్టిన పీఎండీఎస్(ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) విధానం సత్ఫలితాలిస్తోంది. జిల్లాలో 49వేల ఎకరాల్లో ఈ విధానంలో పంటలు సాగు చేస్తుండటం దీనికి నిదర్శనం.
మదనపల్లె టౌన్, జూలై 11(ఆంరఽధజ్యోతి): ప్రకృతి వ్యవసాయానికి అనుసంఽధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎండీఎస్ విధానం జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తోంది. సాధారణంగా వేసవికి ముందుగానే పొలాలు బీడు పెట్టకుండా ఈ విధానంతో 30 రకాల విత్తనాలతో మిశ్రమపంట సాగు చేస్తారు. బీడు భూములను ఒకసాలు దుక్కి దున్నాక విత్తన గుళికలు చల్లుతారు. వాతావరణంలో కొద్దిపాటి తేమ(మంచు) ఉన్నా, కేవలం 5 ఎంఎం వర్షపాతం కురిసినా చాలు ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. వీటి వేర్లు 6 ఇంచిల నుంచి ఒక అడుగు వరకు భూమిలోకి పాకి తేమను ఇనుమడింపజేస్తాయి. ఈ విత్తనాలతో మొలిచే మొక్కలు మూడు అడుగుల ఎత్తు వరకు పెరగడం వలన, భూమిపై పచ్చదనం విస్తరిస్తుంది. తద్వారా ఎండ వేడిమి నుంచి భూమిని కాపాడి బెట్టబారకుండా రక్షించడమేగాక పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. పైగా భూమి అంతర పొరల్లో సూక్ష్మక్రిములు పెరిగి, మంచి బ్యాక్టీరియా సమృద్ధిగా మొక్కలకు అందుతుంది. జిల్లాలో మార్చి నుంచి ఇప్పటివరకు 49వేల ఎకరాల బీడు భూముల్లో పీఎండీఎస్ విధానంతో పంటలు సాగు చేసిన రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో..ఎక్కువ లాభాలు
పీఎండీఎస్ విధానంలో 30 రకాల ధాన్యాలు, చిరుధాన్యాలను తొలుత బంకమట్టి, పేడ, బూడిదతో కలిపి చిన్ని, చిన్ని గుళికలుగా తయారు చేస్తారు. ముఖ్యంగా కందులు, ఉలవలు, పెసలు, మినుములు, శనగలు, అలసందలు, చిక్కుడు(ద్విదళ బీజాలు)ను సీడ్‌బాల్స్(విత్తన గుళికలు) తయారు చేసి భూమిపై చల్లుతారు. వీటితో పాటు త్రిదళ బీజాలు అయిన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్నలు, నూనె గింజలైన నువ్వులు, వేరుశనగ, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కుసుమలు ఇలా పలు రకాల విత్తనాలను కలిపి మిశ్రమ పంటగా సాగు చేస్తారు. ఎకరాకు 30 కిలోల విత్తనాల గుళికలు ఉంటే చాలు. కిలో విత్తనాలు రూ.20 నుంచి రూ.50 పెట్టుకున్నా సరాసరిన కిలో రూ.35 చొప్పున ఎకరాకు రూ.1000 దాకా ఖర్చు వెచ్చిస్తే చాలు. మూడు నెలల తరువాత ఎకరాలో పెరిగే పశుగ్రాసం(మిశ్రమ పంటను) రూ.5 నుంచి 8వేల వరకు విక్రయించుకోవచ్చు.
ఎల్నినోను తట్టుకునేందుకు పీఎండీఎస్ సాగు
సాఽధారణంగా వేసవి ముందే మార్చి, ఏప్రిల్ నెలల్లో పీఎండీఎస్ విధానం ప్రారంభించి, ఖరీఫ్‌కు ముందు ఈ పంటలను దుక్కులు దున్నేసి భూమిలో కలిపేస్తారు. దీని వలన ఈ మొక్కలు భూమిలో కుళ్లి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. అనంతరం ఖరీఫ్ సీజన్‌లో వేసే పంటలకు ఈ ఎరువే ఆదరువుగా ఉండటంతో పాటు రసాయన ఎరువుల అవసరం లేకుండా పోతుంది. తద్వారా రైతుకు పంటసాగు ఖర్చు ముప్పావు వంతు తగ్గిపోతుంది. అలాంటి ఈ విధానం ఇప్పుడు జిల్లాలో ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఎంతో ఉపయోగపడుతోంది. కలెక్టర్ నిశాంత్‌కుమార్ పీఎండీఎస్ విధానంపై వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికతో పనిచేస్తున్నారు. జూన్‌లో 40.4 మి.మీ. మాత్రమే వర్షపాతం కురవగా, జూలైలో అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ క్రమంలో భూమిని బెట్టబారకుండా కాపాడటానికి పీఎండీఎస్ విధానంతో సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో కొద్దిపాటి వర్షాలు(చిరుజల్లులు) కురిసినా మిశ్రమపంట ఏపుగా పెరిగి పాడి రైతులకు బాసటగా నిలుస్తాయి.