Share News

‘స్థానిక’ పోరులో బీసీలకు పెద్దపీట

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:17 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ విడుదల చేసిన రిజర్వేషన్ల సిఫార్సుల్లో జిల్లాలోని బీసీలకు మంచి ప్రాతినిధ్యం దక్కింది. సర్పంచ్‌ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ వార్డు సభ్యుల వరకు పలు స్థానాల్లో బీసీలకు కేటాయింపుల్ని కమిషన్‌ ప్రతిపాదించింది.

‘స్థానిక’ పోరులో బీసీలకు పెద్దపీట

సర్పంచ్‌ నుంచి మున్సిపల్‌ వార్డు వరకు..

రిజర్వేషన్లను సిఫార్సు చేసిన బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌

జిల్లాలో ఆయా స్థానాల్లో ఇవీ రిజర్వేషన్లు

చిత్తూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ విడుదల చేసిన రిజర్వేషన్ల సిఫార్సుల్లో జిల్లాలోని బీసీలకు మంచి ప్రాతినిధ్యం దక్కింది. సర్పంచ్‌ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ వార్డు సభ్యుల వరకు పలు స్థానాల్లో బీసీలకు కేటాయింపుల్ని కమిషన్‌ ప్రతిపాదించింది. తాజా బీసీ రిజర్వేషన్లను 2021తో పోల్చుకుంటే పెద్దగా మార్పులేం కనిపించడం లేదు.

121 సర్పంచ్‌ స్థానాలు..

జిల్లాలో మొత్తం 624 పంచాయతీలకుగానూ 121 సర్పంచి స్థానాల్ని బీసీలకు సిఫార్సు చేశారు. 2021లో 609 గ్రామపంచాయతీల్లో 122 సర్పంచ్‌ స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యాయి. అప్పటితో పోల్చితే బీసీ సర్పంచ్‌ స్థానాల శాతం 20.03 నుంచి 19.39 శాతానికి తగ్గింది. ఇక వార్డుల విషయానికొస్తే.. ప్రస్తుతం జిల్లాలో 5924 వార్డులుండగా, 1209 స్థానాల్ని బీసీలకు సిఫార్సు చేశారు.

204 ఎంపీటీసీ స్థానాలు బీసీలకు..

ఎంపీటీసీ స్థానాల విషయంలో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 876 ఎంపీటీసీ స్థానాలుండగా, 204 స్థానాలను బీసీలకు సిఫార్సు చేశారు. 2021లో 877 స్థానాల్లో 202 స్థానాలు బీసీలకు రిజర్వు చేశారు. దీంతో ఈసారి బీసీ రిజర్వేషన్‌ శాతం 23.03 నుంచి 23.29కు పెరిగింది.

అప్పటిలాగే 15 జడ్పీటీసీ స్థానాలు

జడ్పీటీసీ స్థానాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 65 జడ్పీటీసీ స్థానాలుండగా, 15 స్థానాల్ని బీసీలకు సిఫార్సు చేశారు. 2021లోనూ ఇదే విధంగా 15 స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యాయి. రెండు సందర్భాల్లోనూ బీసీ రిజర్వేషన్‌ 23.08 శాతంగానే ఉంది.

మున్సిపల్‌ వార్డు స్థానాలు ఇలా..

మున్సిపల్‌ వార్డు సభ్యుల విషయంలోనూ పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 130 వార్డులు/డివిజన్లు ఉండగా, 41 స్థానాల్ని బీసీలకు సిఫార్సు చేశారు. 2021లో 40 స్థానాల్ని బీసీలకు రిజర్వు చేశారు. బీసీ వాటా 30.77 నుంచి 31.54 శాతానికి పెరిగింది.

Updated Date - Aug 15 , 2026 | 01:17 AM