స్నానపుగదుల్లో కనీస సౌకర్యాలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:41 AM
తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనపై టీటీడీ ఈవో రవిచంద్ర దృష్టి సారించారు.
తిరుమల, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనపై టీటీడీ ఈవో రవిచంద్ర దృష్టి సారించారు.తిరుమలలోని అతిథిగృహాలు, కాటేజీలు, వసతి గృహాలు,యాత్రికుల వసతి సముదాయాల్లో స్నానపుగది, మరుగుదొడ్లలో సౌకర్యాలపై భక్తులనుంచీ ఇటీవల సూచనలందిన నేపథ్యంలో మరుగుదొడ్డిలో స్టూల్, దానిపై ఒక బకెట్, మగ్గు, పట్టుకోసం కిందభాగంలో, పైభాగంలో స్టీల్ హ్యాండిల్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. అలాగే వృద్ధులకు, దివ్యాంగులకు వసతి సముదాయాల్లోని గ్రౌండ్‌ఫ్లోర్లలో ఐదు శాతం కేటాయించి వారికి అనుకూలంగా స్నానపుగదుల్లో, మరుగుదొడ్లలో యాంటీ స్కిడ్ టైల్స్, నీరు నిలవకుండా వాలుగా ఉండే ఫ్లోర్, బయటకు తెరుచుకునేలా తలుపు, అత్యవసర సమయాల్లో బయట నుంచీ తెరవగలిగే గడియ, టవర్ రాడ్, సోప్ స్టాండ్ వంటి సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. దివ్యాంగులు వినియోగించే చక్రాల కుర్చీ సైతం సులువుగా తిరిగే వెసులుబాటు ఉండేలా స్నానపుగదులను తీర్చిదిద్దాలని సూచించారు. తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లోనూ ఈ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం చర్యలు చేపట్టింది.