Share News

ఆపదలో బేరం.. అంబులెన్స్‌ భారం

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:20 AM

రోగుల కష్టాన్ని కొందరు ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు ఆసరాగా మలచుకుంటున్నారు. ఆపద సమయంలో అత్యవసరంగా తరలించకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనను వారు సొమ్ము చేసుకుంటున్నారు. అడిగిన మొత్తాన్ని చెల్లించలేక, సకాలంలో రోగిని తరలించలేక బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యాశతో కూడుకున్న వ్యాపార ధోరణి విడనాడటంలేదని వాపోతున్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ప్రైవేట్‌ అంబులెన్స్‌ కోసం నిత్యం ఎదురవుతున్న ఇబ్బంది ఇది.

ఆపదలో బేరం.. అంబులెన్స్‌ భారం
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అవరణలో ప్రైవేటు అంబులెన్స్‌లు

  • చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో

ప్రైవేట్‌ నిర్వాహకుల ఇష్టారాజ్యం

  • కష్ట సమయంలోనూ ధనదాహం

  • ప్రభుత్వ అంబులెన్సులకు కొరత

  • ఇబ్బంది పడుతున్న రోగి కుటుంబీకులు

చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి: రోగుల కష్టాన్ని కొందరు ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు ఆసరాగా మలచుకుంటున్నారు. ఆపద సమయంలో అత్యవసరంగా తరలించకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనను వారు సొమ్ము చేసుకుంటున్నారు. అడిగిన మొత్తాన్ని చెల్లించలేక, సకాలంలో రోగిని తరలించలేక బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యాశతో కూడుకున్న వ్యాపార ధోరణి విడనాడటంలేదని వాపోతున్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ప్రైవేట్‌ అంబులెన్స్‌ కోసం నిత్యం ఎదురవుతున్న ఇబ్బంది ఇది.

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం ఉచితంగా లభిస్తున్నా, అంబులెన్స్‌ విషయంలో మాత్రం దోపీడీ తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఆవరణలోనే ప్రైవేటు అంబులెన్సులు మకాం వేసి, రోగులు, వారి కుటుంబ సభ్యుల అత్యవసర పరిస్థితులను అవకాశంగా మలుచుకుని భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ఆస్పత్రికి రోజూ సగటున 1500-1800 మంది రోగులు ఓపీకి వస్తుంటారు. ఇన్‌పేషెంట్లుగా 300మంది వరకూ ఉంటారు. ఇందులో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేరోగులు, రోడ్డుప్రమాదాల్లో గాయపడిన వారు ఉంటున్నారు. ఇన్‌పేషెంట్లలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించిన సందర్భాల్లో తిరుపతి, వేలూరులోని సీఎంసీలకు తరలించేందుకు ఆరాటపడుతుంటారు. రోజూ ఇలా 5-10 మందిని తరలిస్తుంటారు. అప్పో సప్పో చేసి రోగిని బతికించుకోవాలని కుటుంబ సభ్యులు భావిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో రోగి తరలింపు పేద, మధ్య తరగతి వర్గాలకు పెద్ద పరీక్షగా తయారవుతోంది. ఇదే అదనుగా అక్కడి ప్రైవేటు ఆంబులెన్స్‌ల నిర్వాహకులు దూరాన్ని బట్టి కాకుండా పరిస్థితిని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. వారు అడిగిన మేర ఇచ్చుకోలేని వారు అష్టకష్టాలు పడుతున్నారు.

చనిపోయినా కనికరించరు

కొన్ని సందర్భాల్లో రోగి మరణించిన తర్వాత మృతదేహాన్ని తరలించడం కుటుంబ సభ్యులకు పెద్ద సవాలుగా తయారవుతోంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ‘మహాప్రస్థానం’ పేరిట వాహన సేవను ఏర్పాటు చేసింది. కానీ చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ సేవలు సమర్థంగా అందడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో దుఃఖ సమయంలో ప్రెవేటు అంబులెన్సులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు అవకాశంగా మార్చుకుంటున్నారు. కనీస మానవత్వం చూపకుండా వేల రూపాయలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దాతల అంబులెన్సులు ఎక్కడ..?

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి అమరరాజా కంపెనీ నిర్వహకులు అధునాతన అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఐవోసీఎల్‌ కంపెనీ వారు కూడా బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ ఇచ్చారు. అందులో అమరరాజా కంపెనీ ఇచ్చిన అంబులెన్స్‌ను ఉన్నతాధికారుల ఆదేశాలతో 108కి అప్పగించారు. మరో అంబులెన్స్‌ను ఉపయోగించడం లేదని తెలుస్తోంది. దీంతో రోగులు పూర్తిగా ప్రైవేటు ఆంబులెన్స్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడి కొరతను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

ఆస్పత్రి ఆవరణలోనే అడ్డా..

ప్రైవేటు అంబులెన్సులు ఆస్పత్రి అవరణలోనే నిలిపివేస్తూ...వంతుల వారీగా రోగులను తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రిలోకి వచ్చిన రోగి నుంచి మృతదేహం వరకు ప్రతి దశలో ప్రైవేటు అంబులెన్స్‌ల పెత్తనం కొనసాగుతోందని విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌ల దందాపై ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడంలేదు. మహాప్రస్థానం వాహనం అందుబాటులో తేవడంతో పాటు, ప్రత్యేక ప్రభుత్వ అంబులెన్స్‌లను సమకూర్చితే ఇక్కడి ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని రోగులు చెబుతున్నారు.

మా దృష్టికి రాలేదు

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి పీపీపీ పద్ధతి కింద నడుస్తోంది. అందులో భాగంగా క్యాజువాలిటీలో వైద్యులు అపోలోకు చెందిన వారు మాత్రమే ఉంటారు. కేసులను కూడా వారే రెఫర్‌ చేస్తుంటారు. ఈ సమస్య మా దృష్టికి రాలేదు.

- ఉషశ్రీ, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎంఎస్‌

Updated Date - Jun 24 , 2026 | 12:20 AM